హైదరాబాద్‌లో ఉగ్రవాద స్థావరాలు
posted on Oct 25, 2014 3:46PM
.jpg)
హైదరాబాద్‌లో ఉగ్రవాద స్థావరాలు కొనసాగుతున్నాయని భారతీయ జనతాపార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. ఇటీవల కరీంనగర్ జిల్లాలో జరిగిన ఒక బ్యాంకు మీద తీవ్రవాదులు దాడి చేసి దాదాపు 50 లక్షల రూపాయలు దోచుకున్నారు. ఆ డబ్బును దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించే ప్రణాళికను సిద్ధం చేశారని బయటపడింది. ఈ విషయాన్ని కిషన్ రెడ్డి ప్రస్తావించారు. హైదరాబాద్ నగరం మరోసారి దేశ వ్యతిరేక కార్యక్రమాలకు వేదిక అవుతోందని ఆయన అన్నారు. హైదరాబాద్లో ఉగ్రవాద స్థావరాలు ఇంకా కొనసాగుతున్నాయని, బ్యాంకును దోచుకున్న తీవ్రవాదులు ఆ డబ్బును ఉగ్రవాద కార్యకలాపాలకు వాడుకోవటం చాలా ఆందోళనకరమైన అంశమన్నారు. దేశంలో ఎక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు జరిగినా దానికి మూలాలు హైదరాబాద్లో ఉంటున్నాయని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ వ్యవస్థలో మార్పులు తీసుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రభుత్వం ఉగ్రవాదుల నియంత్రణ గురించి ఎంతమాత్రం ఆలోచించినట్లు కనిపించటం లేదని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.