తెలంగాణ సీఎం విపరీతబుద్ధిని ప్రదర్శించారు
posted on Oct 25, 2014 5:28PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మితిమీరి మాట్లాడారని, విపరీత బుద్ధిని ప్రదర్శించారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ విమర్శించారు. తాము కేసీఆర్ నోట్లో నోరు పెట్టదలచుకోలేదని, కేసీఆర్ తీరు, వాదన తెలుగు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాల రెండు ప్రభుత్వాల పనితీరు మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, అందరూ ఈ రెండు రాష్ట్రాలవైపే చూస్తున్నారని పరకాల ప్రభాకర్ చెప్పారు. కేసీఆర్ కేవలం తనను తాను సమర్థించుకునేలాగే మాట్లాడుతున్నారని, శ్రీశైలం నీటి మట్టాలపై విడుదల చేసిన రెండు జీవోలను అర్థం చేసుకునే సమర్థత కేసీఆర్కు లేనట్లు అనిపిస్తోందని పరకాల అభిప్రాయపడ్డారు. రెండు జీవోలను పాటిస్తామని కృష్ణా బోర్డు దగ్గర రెండు ప్రభుత్వాలు అంగీకరించాయని, ఇప్పుడు తిరకాసుగా మాట్లాడ్డం అర్థంలేనిదని అన్నారు. 107 జీవో విడుదల అయినప్పుడు హరీష్ రావు మంత్రివర్గంలో వున్నరని పరకాల ఈ సందర్భంగా గుర్తు చేశారు.