ఇక ఇప్పుడు బీజేపీ దృష్టి బెంగాల్ పై!
posted on Nov 24, 2025 1:18PM

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరు నెలల గడువు ఉంది. ఈ నేపథ్యంలో బీహార్ లో మహాఘట్ బంధన్ ను మట్టికరిపించిన బీజేపీ ఇప్పుడు తన దృష్టి మొత్తం పశ్చిమ బెంగాల్ పై కేంద్రీకృతం చేసింది. వచ్చే ఎన్నికలలో ఎలాగైనా బెంగాల్ లో అధికార పగ్గాలు చేపట్టడమే లక్ష్యంగా ఇప్పటి నుంచే వ్యూహాలను రచిస్తోంది. పావులు కదుపుతోంది. పశ్చిమ బెంగాల్ లో గత పదిహేనేళ్లుగా అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ను గద్దె దింపడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో వరుసగా మూడు సార్ల విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టిన మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ నాలుగో సారి కూడా విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది.
అయితే గత 15 ఏళ్లుగా అధికారంలో ఉండటంతో ఈ సారి మమతా బెనర్జీ, ఆమె పార్టీ పట్ల ప్రజలలో ఒకింత వ్యతిరేకత కనిపిస్తోంది. దీంతో ఈ సారి గెలుపు అంత వీజీ కాదన్న అభిప్రాయం పరిశీలకులలో వ్యక్తం అవుతున్నది. మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ కు తొలి రెండు విజయాలూ సునాయాసంగానే లభించాయి. అప్పట్లో పోటీ తృణమూల్ వర్సెస్ కమ్యూనిస్టులు అన్నట్లు ఉండేది. అప్పటికే పాతికేళ్లకు పైగా రాష్ట్రంలో అధికారం చెలాయించిన కమ్యూనిస్టులపై ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉండటంతో తృణమూల్ విజయం నల్లేరుమీద బండి నడకే అయ్యింది. అయితే మూడో సారి తృణమూల్ విజయం అంత సునాయాసంగా అయితే లభించలేదు. తనకు పోటీ లేకుండా చేయడానికి మమతా బెనర్జీ రాష్ట్రంలో బీజేపీని పెంచి కమ్యూనిస్టులను నిర్వీర్యం చేశారు. దీంతో గత అసెంబ్లీ ఎన్నికలలో మమతా బెనర్జీ బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంది. సరే సంపూర్ణ మెజారిటీతోనే తృణమూల్ విజయం సాధించి ముచ్చటగా మూడో సారి అధికార పగ్గాలు చేపట్టినప్పటికీ.. ఇప్పుడు రానున్న అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీతో హోరాహోరీ పోరు తప్పదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.
వాస్తవానికి పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ఈ స్థాయిలో బలపడిందంటే అందుకు ప్రధాన కారణం మమతా బెనర్జీయే అని చెప్పాలి. కమ్యూనిస్టులకు పెట్టని గోడలుగా ఉన్న ప్రాంతాలలో ఒక పద్ధతి ప్రకారం వారి ప్రాబల్యాన్ని మమతా బెనర్జీ నిర్వీర్యం చేశారు. అయితే ఆ స్థానంలో ఆమె పార్టీని బలోపేతం చేయడంతో పాటు బీజేపీకి ఎదగడానికి అవకాశాలు కల్పించినట్లైంది. ఇక ప్రభుత్వ వేధింపుల కారణంగా కమ్యూనిస్టులు చెల్లా చెదురైపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదు సమయంలో స్వీయరక్షణ కోసం చాలా వరకూ కమ్యూనిస్టులు కమలం పార్టీ పంచన చేరినట్లు రాజకీయవర్గాలు చెబుతున్నాయి. సరిగ్గా తెలంగాణలో ఈటల వంటి కమ్యూనిస్టు భావజాలం ఉన్న నేతలు కూడా బీఆర్ఎస్ ను ఎదిరించేందుకు కమలం పార్టీ పంచన చేరిన చందంగానే తృణమూల్ ధాటి నుంచి తమను తాము కాపాడుకుని ఎదిరించేందుకు పశ్చిమ బెంగాల్ లో కూడా కమ్యూనిస్టులు బీజేపీకి చేరువయ్యారని విశ్లేషిస్తున్నారు.
2016లో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో కేవలం 10 శాతంగా ఉన్న బీజేపీ ఓటు బ్యాంకు 2021 అసెంబ్లీలో 38 శాతానికి పెరిగింది. దీంతో ఈ సారి ఎలాగైనా రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్న పట్టుదలతో బీజేపీ ఉంది. కాగా బీజేపీ ఇప్పుడు కలిసివచ్చే అంశమేంటంటే.. తృణమూల్ అధినేత్రితో విభేదించి కమలం గూటికి చేరిన నేతలే ఇప్పుడు బీజేపీ రాష్ట్ర పార్టీలో అగ్రనేతలుగా ఉన్నారు. వీరంతా మోడీ, అమిత్ షా మార్గదర్శకత్వంలో తృణమూల్ పరాజయం, మమతా బెనర్జీని గద్దెదింపడమే లక్ష్యంగా పని చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ప్రభుత్వ వ్యతిరేకత ఉందని గ్రహించినా మమతా బెనర్జీ గ్రామీణ ప్రాంతాలు, రాష్ట్రంలో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న ముస్లిం ఓటర్లపైనే మమతా బెనర్జీ ధీమాగా ఉన్నారు. చూడాలి మరి వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో తృణమూల్, బీజేపీ మధ్య పోటీ ఎంత తీవ్రంగా ఉంటుందో.. ఎవరు గెలిచి అధికారపగ్గాలు చేపడతారో?