నాయకత్రయం.. ప్రజలతో మమేకం!
posted on Nov 25, 2025 9:29AM

రాజకీయ కక్ష సాధింపు, బటన్ నొక్కి సంక్షేమం పందేరం చేయడమే పాలన అనుకున్న మాజీ ముఖ్యమంత్రి జగన్, అదే సమయంలో జనసామానికి కూడా దూరంగా ఉన్నారు. ఆయన ప్రజలతో మమేకం కావడం అటుంచి ముఖ్యమంత్రిగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడానికి కూడా ఇష్టపడలేదు. అరాచకపాలనకు తోడు జనానికి దూరంగా ఉండటం కూడా వైసీపీ గత ఎన్నికలలో ఘోర పరాజయం పాలు కావడానికి ప్రధాన కారణంగా మారింది.
అయితే అందుకు భిన్నంగా ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి సర్కార్ ప్రజల ప్రభుత్వంగా గుర్తింపు పొందుతోంది. పీపుల్ ఫస్ట్ అన్నట్లుగా పరాజకీయాలు నడుపుతోంది. కూటమి నేతలు ప్రజలతో మమేకం అవుతున్నారు. మరీ ముఖ్యంగా కూటమిలో, కూటమి ప్రభుత్వంలో అత్యంత కీలకమైన, ప్రధానమైన ముగ్గురు నేతలూ ప్రజలతో మమేకమౌతూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్, ఐటీ మంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి నెలా మొదటి తారీకున పింఛన్ల పంపిణీ సందర్భంగా ప్రజలలోకి వస్తున్నారు. అంతే కాకుండా శ్రేణులతో ప్రతి రెండు వారాలకు ఒక సారి సంభాషిస్తున్నారు. అదే విధంగా జనసేనాని, ఉమముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు.
ఇక ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా ప్రజాదర్బార్ తో తరచుగా ప్రజలకు అందుబాటులోకి వస్తున్నారు. అంతే కాకుండా లోకేష్ దృష్టికి సమస్య తీసుకువెడితే అది పరిష్కారం అయిపో యినట్లేనన్న గుర్తింపు సాధించారు. అదే సమయంలో రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే విషయంలో కూడా లోకేష్ అనితర సాధ్యమనదగ్గ చొరవ చూపుతున్నారు. విద్యాశాఖ మంత్రిగా విద్యాసంస్కరణలను అమలు చేస్తూ అందరి ప్రశంసలూ అందుకుంటున్నారు. మొత్తంగా తెలుగుదేశం కూటమి పాలన రాష్ట్ర వ్యాప్తంగా ఒక పాజిటివ్ పొలిటికల్ ఎట్మాస్ఫియర్ ను తీసుకువచ్చింది.