తెలంగాణా అంశంపై బిజెపికి అంత ఆసక్తి దేనికో?

 

భారతీయజనతా పార్టీ గత రెండు దశబ్దాలుగా దక్షిణాది రాష్ట్రాలలో తన కమలాన్ని వికసింపజేయాలని ఎంతగా ప్రయత్నిస్తున్నపటికీ, కర్ణాటకలో తప్ప మరి వేరే ఏ రాష్ట్రంలోను మొగ్గ తొడగలేకపోయింది.అధికారంలో ఉన్న ఆ ఒక్క రాష్ట్రంలో కూడా తిరుగుబాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి ఎడ్యురప్ప సొంత కుంపటి పెట్టి బీజేపీకి ఎసరు పెడుతుండటంతో, అక్కడ కూడా ఆపార్టీ పరిస్థితి (ఎడ్యురప్ప) తుమ్మితే ఊడిపోయే ముక్కులా దయనీయంగా తయారయింది.

 

ఇక, ఆంధ్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో ఉన్నబలమయిన ప్రాంతీయ పార్టీలు బీజేపీ ఆయా రాష్ట్రాలలో కాలు కాదుకదా, వేలు కూడా పెట్టేందుకు చోటు మిగల్చకపోవడంతో, మూడు రాష్ట్రాలలో ఆ పార్టీ ఉనికి అంతంత మాత్రంగానే ఉంది. అయితే, గత దశాబ్దకాలంగా సాగుతున్న తెలంగాణా ఉద్యమం, బీజేపీకి రాష్ట్రంలో ఊహించని ఒక కొత్త అవకాశాన్నిఅందజేసింది. మొదట్లో బీజేపీ తెలంగాణా విషయంలో కొంచెం సందిగ్ద పడినప్పటికీ, అదే తమకు రాష్ట్రంలో కాలుమోపేందుకు ఒక చక్కటి అవకాశం కల్పిస్తోందని గ్రహించిన బీజేపీ తెలంగాణా విషయంలో మరిక ఎన్నడూ కూడా వెనుతిరిగి చూడలేదు. నాటి నుండి నేటి వరకూ కూడా బీజేపీ తెలంగాణా ఉద్యమాలలో కీలక పాత్ర పోషిస్తూ, క్రమంగా తెలంగాణాలో తన బలం పెంచుకొనగలిగింది.

 

అదే సమయంలో, బీజేపీ అధిష్టానం కూడా తెలంగాణా విషయంలో నిర్ద్వందంగా తన అభిప్రాయాన్ని ప్రకటిస్తూ, తాము అధికారంలోకి రాగానే ఖచ్చితంగా 100 రోజుల్లోనే తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. నిన్న ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ పార్లమెంటులో అదే విషయాన్నీ మరో మారు దృవీకరిస్తూ, యు.పీ.ఏ. ప్రభుత్వం గనుక తెలంగాణా ఈయకపోతే, తాము అధికారంలోకి రాగానే తెలంగాణా ఇస్తామని మరోమారు స్పష్టం చేసారు.

 

కాంగ్రెస్ పార్టీ నాన్చుడు ధోరణితో విసిగెత్తిపోయిన తెరాస అధినేత కేసీఆర్ కూడా యు.పీ.ఏ. కాకపొతే ఎన్డీయే మరో ప్రత్యామ్నాయం ఉందంటూ ప్రకటించాడు.

 

ఇక, రాష్ట్రంలో బీజేపీ విషయానికి వస్తే, కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు లేని ఒక గొప్ప అవకాశం అది కలిగిఉంది. ఆ మూడు పార్టీలు కూడా రాష్ట్రంలో తమ పరిస్థితులు తలక్రిందులవుతుందనే భయంతో తెలంగాణా అంశంపై నేటికీ నోరు మెదపడానికి భయపడుతుండగా, రాష్ట్రంలో తెలంగాణాలో తప్ప మరే ఇతర ప్రాంతాలలో ప్రభావం చూపని బీజేపీ సరిగ్గా ఇదే కారణంతో ఆరెండు పార్టీలను అధిగమించి నిర్ద్వందంగా తెలంగాణా అనుకూల నిర్ణయం ప్రకటించి, చురుకుగా ఉద్యమంలో పాల్గొంటోంది.

 

తద్వారా బీజేపీకి రాష్ట్రంలో కొత్తగా కోల్పోయేదేమి లేకపోయినా, తెలంగాణాలో తానూ చేస్తున్న ఉద్యమాలవల్ల కనీసం తెలంగాణా ప్రాంతాలలోనయినా తన జెండా ఎగురవేయగలిగే అవకాశం దక్కుతుందని అది ఆశపడుతోంది.

 

అయితే, తెలంగాణా బలంగా ఉన్న తెరాసను కాదని తానూ ఒంటరిగా గెలవగలదని ఖచ్చితంగా చెప్పలేనప్పటికీ, బీజేపీకి రాష్ట్రంలో తన ప్రాభల్యం పెంచుకొనేందుకు ఇంతకంటే వేరే ప్రత్యామ్నాయ అవకాశం కూడా లేదు గనుక తెలంగాణా అంశం పట్టుకొని ముందుకు సాగిపోతోందని చెప్పవచ్చును.

 

ఒకవేళ ఆ పార్టీకి కూడా ఆంద్రా ప్రాంతంలో గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉండిఉంటే, బహుశః బీజేపీ కూడా తెలంగాణా అంశంపై కాంగ్రెస్,వైయస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ప్రస్తుతం అనుసరిస్తున్న వైఖరినే అవలంబించి ఉండేదేమో!