తల్లిని తలుచుకోని.. భావోద్వేగానికి గురైన మంచు లక్ష్మీ
posted on Jul 22, 2025 6:09PM

ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ప్రముఖ సినీనటి మంచు లక్ష్మి సందడి చేశారు. పట్టణంలోని రాజగోపాలపురంలో టీచ్ ఫర్ చేంజ్‌ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ రూమ్‌ను మంచు లక్ష్మి ప్రారంభించారు. డిజిటల్ క్లాస్‌రూమ్‌ను ప్రారంభించేందుకు విచ్చేసిన సినీనటి మంచు లక్ష్మికి స్థానిక నాయకులు, విద్యాశాఖ అధికారులు, విద్యార్థులు పూలమాలలు, శాలువలతో సత్కరించి ఘనస్వాగతం పలికారు.
మంచు లక్ష్మీని చూసేందుకు భారీ సంఖ్యలో వచ్చిన అభిమానులు, బంధువులు అధిక సంఖ్యలో తరలివచారు. ముందుగా నాయుడుపేటలోని అమరాగార్డెన్‌లో ఉన్న అమ్మగారి స్మృతివనం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలన్న లక్ష్యంతో టీచ్‌ఫర్ చేంజ్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో 320 పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు మంచు లక్ష్మి తెలియజేశారు.
అమ్మమ్మ గారి ఊరిలో ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ రూమును ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. అధునాతన సాంకేతికతతో విద్యార్థులకు డిజిటల్ క్లాస్ రూమ్ అన్ని వసతులతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. విద్యార్థులు మంచి లక్ష్యాన్ని ఎంచుకుని చదువుల్లో ఉన్నతంగా రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ సనత్‌కుమార్, ఎంఈఓ బాణాల మునిరత్నం, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.