బాంబులతో రాజకీయనాయకుల బంతులాటలు

 

రాష్ట్రం నుండి తెలంగాణా విడిపోతే నక్సలయిట్లకు నిలయంగా మారుతుందనే అంశంపై గతంలో రాజకీయ నేతల మద్య చాలా తీవ్ర స్థాయిలో వాదప్రతివాదాలు జరిగాయి. ఇప్పుడు హైదరాబాద్ బాంబు ప్రేలుళ్ళ నేపద్యంలో తెలంగాణా విడిపోతే హైదరాబాద్ నగరం ఉగ్రవాదులకు నిలయంగా మారుతుందని అంటూ మంత్రి టీజీవెంకటేష్ కొత్త చర్చ మొదలుపెట్టగా, దానికి విజయవాడ యం.పీ.లగడపాటి రాజగోపాల్ వంతపాడటంతో సహజంగానే మళ్ళీ తెలంగాణావాదుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకాయి.

 

మొట్ట మొదట పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ, “రాష్ట్ర విభజన జరగకుండా ఆపేందుకు టిజి వెంకటేష్, లగడపాటి ఇద్దరూ ఈ బాంబు ప్రేలుళ్ళలో ఏమయినా పాత్ర పోషించారా? కుట్రలో వీరికి ఏమయినా భాగం ఉందా అనే కోణంలో కూడా విచారణ చెప్పటాల్సిన అవసరం ఉంది,” అని అన్నారు. అయితే, ఉగ్రవాదులతో, దేశద్రోహనేరంతో తోటి కాంగ్రెస్ వారిని ముడిపెట్టడం ఎంతవరకు సబబో ఆయనకే తెలియాలి. తద్వారా ప్రతిపక్షాలకు ఆయన ఎటువంటి సందేశం ఇస్తున్నారో ఆయనకి అర్ధం అయినట్లు లేదు.

 

వీరి గొడవ ఇలా సాగుతుంటే, మరో వైపు తెలంగాణా జేయేసీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కూడా రంగ ప్రవేశం చేసి, అసలు కాంగ్రెస్ అసమర్ధ పరిపాలనవల్లనే ఇటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని, రాష్ట్రం మొత్తం ఉగ్రవాదులకు నిలయంగా మారిందని, అందుకు రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీనే తప్పు పట్టాలని అన్నారు.

 

దేశ భద్రతకే పెనుసవాలు విసిరిన ముష్కర మూకలను ప్రాంతాలకు, మతాలకు అతీతంగా కలిసికట్టుగా ఎదుర్కోనవలసిన ఈ తరుణంలో, ఈ విదంగా బాంబు ప్రేలుళ్ళను కూడా రాజకీయం చేసి, ప్రాంతీయవాదం, సమైక్యవాదం అంటూ మీడియాకెక్కి మరీ మన రాజకీయ నాయకులు కీచులాడుకోవడం ప్రజలకు వారిపట్ల ఏహ్యత కలిగిస్తోంది. ఇటువంటి వారిని తమ ప్రతినిధులుగా ఎన్నుకొనందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారు.