ఏపీ కన్నా బీహారే నయం!

ఆంధ్రప్రదేశ్ లో స్టార్టప్ ల ర్యాంకింగ్ లో ఏపీ దేశంలోనే చిట్ట చివరి స్థానంలో నిలిచింది. ఇది ఏ రాజకీయ పార్టీయో చేసిన విమర్శ కాదు. కేంద్రం ఇచ్చిన ర్యాంకింగ్. ఔను స్వయంగా కేంద్రం ప్రకటించిన ర్యాంకింగ్స్ లోనే ఏపీ దేశంలోనే చిట్ట చివరి స్థానంలో నిలిచింది. దేశంలో స్టార్టప్ ల ఎకో సిస్టమ్ లలో ఏ రాష్ట్రం మెరుగ్గా ఉంది అన్న అంశంపై కేంద్రం ఇచ్చిన ర్యాంకింగ్ లలో ఏపీకి వచ్చిన ర్యాంక్ ఇది. ఈ ర్యాంకింగ్స్ లో ఏపీ కన్నా బీహార్ మెరుగ్గా ఉంది. మరి అగ్ర స్థానంలో ఉన్నరాష్ట్రం ఏమిటంటారా అది గుజరాత్. రెండో స్థానంలో కర్నాటక నిలిచింది. స్టార్టప్ ల విషయంలో  రెండు కేటగరీల్లో కేంద్రం ఈ ర్యాంకులను ప్రకటించింది. కోటి కన్నా ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలను ఏ కేటగిరీలో చేర్చింది.

కోటి కన్నా తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలను బి కేటగిరిలో చేర్చింది. ఏ కేటగిరిలో స్టార్టప్ ల విషయంలో గుజరాత్ తొలి ర్యాంక్ సాధించగా, ఆ తరువాతి స్థానాలలో వరుసగా కర్నాటక, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, అసోం, బీహార్ లు నిలిచాయి. ఎప్పుడో 2020 నాటి పరిస్థితిని ప్రమాణికంగా తీసుకుని ఈవోడీబీ (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో ఏపీ అగ్రస్థానంలో నిలిచిందంటూ సొంత భుజాలను చరిచేసుకుంటూ విపరీతంగా ప్రచారం చేసుకున్న జగన్ సర్కార్ కు ఇప్పుడు స్టార్టప్ ల విషయంలో వచ్చిన తాజా ర్యాంకింగ్ కు ఏం సమాధానం చెబుతుందో చూడాలంటూ నెట్టింట విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలో 2019 వరకూ తెలుగుదేశం అధికారంలో ఉంది. అంతకు ముందు వరుసగా మూడేళ్ల పాటు ఈవోడీబీ ర్యాంకింగ్స్ లో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది.

అంటే తెలుగుదేశం అధికారంలో ఉన్నఐదేళ్లలో వరుసగా నాలుగేళ్లు ఏపీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ ముందు వరుసలో ఉంది. ఆ ప్రతిఫలమే 2020లో ఈవోడీబీ ర్యాంకింగ్స్ లో ఏపీకి తొలి స్థానం. అందులో వైసీపీ ఘనత ఏమీ లేదు. తాజాగా స్టార్టప్ లకు వాతావరణం బాగున్న రాష్ట్రాలలో ఏపీ సాధించిన చిట్ట చివరి స్థానం ఘనత మాత్రం పూర్తిగా జగన్ సర్కార్ దేనని పారిశ్రామిక రంగ నిపుణులు అంటున్నారు.

ఏపీ కంటే బీహారే బెటరని కేంద్రం ఇచ్చిన ర్యాంకింగ్స్ లోనే రుజువైందని పేర్కొంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా తొలి ఐదేళ్లు పారిశ్రామికంగా ఏపీ వేగంగానే పురోగమించింది. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ మూడేళ్లలోనూ పారిశ్రామిక ప్రగతి రివర్స్ గేర్ లో నడుస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ విమర్శలన్నీ వాస్తవాలేనని తాజా ర్యాంకింగ్స్ నిర్ద్వంద్వంగా నిరూపించాయి. ఏపీలో మూమూలు వ్యాపారాలే సజావుగా సాగే పరిస్థితి లేదనీ, ఇక స్టార్టప్ లకు ఎవరు ముందుకొస్తారనీ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.