కమలంలో లుకలుకలు!

నిజం. బీజేపీలో జోష్ పెరిగింది. జాతీయ కార్యవర్గ సమావేశాలు విజయవంతగా నిర్వహించడమే కాకుండా.. బహిరంగ సభను ఆ స్థాయిలో సక్సెస్ చేయడంతో  పార్టీ జాతీయ  నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వం పై విశ్వాసం మరింతగా పెరిగింది. ముఖ్యంగా బహిరంగ సభ ఆ స్థాయిలో సక్సెస్ అవుతుందనికానీ, అంత పెద్ద ఎత్తున జనసమీకరణ సాధ్యమవుతుందని కానీ, ప్రధాని నరేంద్ర మోడీ సహా పార్టీ పెద్దలు ఎవరూ ఉహించలేదు. అందుకే, ప్రధాని నరేంద్ర మోడీ, ఉబ్బి తబ్బిబై పోయారు. వేదిక మీదనే, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్’ను భుజం తట్టి మరీ అభినందించారు. 

అయితే, ఇప్పడు ఆ అభినందనే పార్టీలో లుకలుకలు సృష్టించిందా, అంటే, అవుననే అంటున్నారు పార్టీ పెద్దలు, పరిశీలకులు.నిజానికి బీజేపీలో గత కొంత కాలంగా సంజయ్ కేంద్రంగా అప్పుడప్పుడు లుకలుకలు బయటపడుతూనే ఉన్నాయి. అలాగే, పాత కొత్త నాయకుల వివాదం కూడా ఎప్పటినుంచో వుంది. ఆ కారణంగానే నాగం జనార్ధన రెడ్డి, మొత్కుపల్లి నరసింహులు ఎక్కువకాలం పార్టీలో ఉండలేక పోయారు. మరోవంక పార్టీలో కొనసాగుతున్న బయటి నేతల్లోనూ అసంతృప్తి అప్పుడప్పుడు బయట పడుతూనే వుంది.  దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన రావు అయితే, సంజయ్ వ్యవహార శైలిపై బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తపరిచారు. అలాగే, పార్టీలో పాత కాపులు కొత్తగా చేరిన నాయకుల మధ్య రోజురోజుకు దూరం రుగుతోందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. 

హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్’ కూడా ఒకటి రెండు సందర్భాలలో ఈ విషయంలో తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్త పరిచారు.ఎంతోకాలంగా పార్టీలో ఉన్న నాయకులకు, కొత్తగా చేరిన నేతలకు మధ్య సహజంగానే కొంత వ్యత్యాసం ఉంటుంది. అందులోనూ భావజాల పునాదులపై నిర్మాణమైన పార్టీలో ఇలాంటి దూరం ఇంకొంత ఎక్కువగానే ఉంటుంది. అయితే. పార్టీ ఎదగాలన్నా, ఎన్నికల్లో గెలవలన్నా, క్షేత్ర స్థాయిలో పట్టున్న నాయకులకు కలుపుకు పోవడం అవసరమని ఈటల గతంలోనే బహిరంగంగా తమ అసంతృప్తిని వ్యక్తపరిచారు.

 అయితే, జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా, అంతకు ముందు కూడా పార్టీ జాతీయ నాయకత్వం ఈటల ఇవ్వవలసిన గౌరవం ఇచ్చిందని, పార్టీలో మొదటి నుంచి ఉన్న నాయకులకు ఇచ్చిన గౌరవమే ఈటలకు ఇస్తోంది పార్టీ నేతలు అంటున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో, రాజకీయ తీర్మానంలో భాగంగా తెలంగాణ రాజకీయ పరిస్తితులపై  ప్రసంగించే అవకాశం, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఈటల రాజేందర్’ కు ఇచ్చారని, అలాగే, బహిరంగ్ సభలో అవకాశం కూడా ఈటలలకు దక్కిందని అంటున్నారు.  

అదలా ఉంటే, అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ..ఇప్పడు బండి సంజయ్ ని ప్రధాని మోడీ అభినందించడం దేనికి సంకేతం అనే చర్చమొదలైంది. మరో వంక ఎన్నికలు ఎప్పుదు వచ్చినా విజయం బీజేపీదే, అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించిన నేపధ్యంలో, ‘నిజ్జంగానే’ బీజేపే అధికారంలోకి వస్తే, ముఖ్యమంత్రి ఎవరు? అనే ప్రశ్న తెరమీదకు వచ్చింది. నిజానికి గతంలోనూ తుక్కుగూడలో ఏర్పాటు చేసిన సభలో హోం మంత్రి అమిత్ షా.. కేసీఆర్‌ను ఎదుర్కోవడానికి మోడీ అవసరం లేదని.. ఇందుకు బండి సంజయ్ సరిపోతారని సంజయ్ సామర్ధ్యంపై విశ్వాసం ప్రకటించారు . ఇప్పడు, మోడీ మరింత ఉత్సాహంగా భుజం తట్టడంతో మరోసారి పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరనే విషయంలో చర్చ మొదలైనట్లు తెలుస్తోంది. 

అయితే పార్టీ సీనియర్ నాయకులు మాత్రం, బీజేపీలో నాయకుల మధ్య పోటీ ఉంటుంది. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధాని అభ్యర్ధి ఎవరన్న విషయంలో పార్టీలో చాలా  పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పార్టీ సీనియర్ నాయకుడు అద్వానీ, అప్పటి ప్రతిపక్ష నేత   సుష్మా స్వరాజ్ సహా చాలా మంది నేతలు పోటీ పడ్డారు. చివరకు పార్టీ మోడీ పేరు ఖరారు చేసిన తర్వాత, అక్కడక్కడ లుకలుకలు వినిపిచినా, పార్టీ అనూహ్య విజయం సాధించడంతో, అందరూ సర్దుకు పోయారని గుర్తు చేస్తున్నారు.  అదే విధంగా, తాజాగా మహారాష్టలో మాజే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌’ను కాదని శివసేన చీలిక వర్గం నాయకుడు ఏక్’నాథ్ షిండే’కు అవకాశం ఇచ్చిన విషయాన్ని సీనియర్లు గుర్తు చేస్తున్నారు.

బీజేపీ సన్యాసుల మఠం కాదు.పార్టీ నాయకులకు పదవుల మీద ఆశలు ఉండవు అని అనలేము. ఎవరైనా అలా అనుకుంటే అది ఆత్మ వంచనే అవుతుందని, అయితే వ్యక్తిగత పదవుల కంటే పార్టీకి, పార్టీ కంటే దేశానికీ పెద్ద పీట వేయడం(దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్, వ్యక్తీ లాస్ట్) నేతలు ఫాలో అవుతారని పార్టీ సీనియర్ నాయకులు  అంటున్నారు.

అయితే, ఆలు లేదు చూలు లేదు, అప్పుడే ముఖ్యమంత్రి ఎవరన్న చర్చ అనవసరమని, సమయం వచ్చినప్పుడు పార్టీ జాతీయ నాయకత్వం ఆ విషయం  చూసుకుంటుందని అంటున్నారు. అలాగే, ఇప్పటి నుంచే ముఖ్యమంత్రి ఎవరు? అనేంత వరకు వెళితే, అది మొదటికే మోసం అవుతుందని అంటున్నారు. అయితే, పార్టీలో  లుకలుకలు అయితే మొదలయ్యాయి, అందులో సందేహం లేదని పరిశీలకులు అంటున్నారు.