పెద్దల సభలో విపక్ష ఐక్యతకు బిగ్ టెస్ట్ ?

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఢిల్లీ ఆర్డినెన్స్, స్థానంలో గత వారం పార్లమెంట్’లో ప్రవేశ పెట్టిన గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ..  బిల్లు లోక్’సభ ఆమోదం పొందింది. ఐఎన్డీఐఎ (ఇండియా) కూటమి ఐక్యతకు పరీక్షగా నిలుస్తున్నఈ బిల్లు సోమవారం  రాజ్యసభ ముందుకు వస్తుంది. ఢిల్లీ బిల్లును సోమవారం (ఆగష్టు 7)  పెద్దల సభలో ప్రవేశ పెట్టి అదే రోజు ఆమోదం పొందేందుకు ప్రభుత్వం సిద్దమైంది. అందుకే, ఆగష్టు 7, సోమవారం బీజీపీ సభ్యులు అందరూ సభకు హాజరు కావాలని విప్ జారీచేసింది. 

అయితే, లోక్ సభలో ఉన్న సంఖ్యా బలంతో  అక్కడ సునాయాసంగా బిల్లుకు ఆమోదం పొందిన ఎన్డీఎ సర్కార్’కు పెద్దల సభలో, బిల్లును నెగ్గించుకోవడం అంత ఈజీ వ్యవహారం కాదనే అభిప్రాయాన్ని విపక్షాలు ముందు నుంచి వ్యక్త పరుస్తున్నాయి. పెద్దల సభలో తగినంత సంఖ్యాబలం లేని అధికార కూటమిని ఆత్మరక్షణలో పడేయడమే కాదు, బిల్లును ఓడించి చెక్ పెట్టే అవకాశం కూడా లేకపోలేదన్న విశ్లేణలు కూడా వినిపించాయి.అయితే, లోక్’సభలో అవసరం లేకున్నా ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ, ఒరిస్సాలో అధికారంలో ఉన్న బీజేడీ బిల్లును సమర్ధించడంతో,కాంగ్రెస్ సహా ఐఎన్డీఐఎ(ఇండియా) కూటమి భాగస్వామ్య పార్టీలు మరో దారి లేక ఓటింగ్ సమయానికి  వాకౌట్ చేసి ఆబోరు నిలుపుకున్నాయి.

ఈ నేపధ్యంలో ఢిల్లీ బిల్లు చుట్టూ అల్లుకున్న విపక్ష ఐఎన్డీఐఎ కూటమి ఐక్యతకు అదే బిల్లు ఇప్పడు పరీక్ష పెడుతోందనే అభిప్రాయం, ఆందోళన విపక్ష కూటమిలో,మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో వినవస్తోంది.   నిజానికి, లోక్ సభలో బిల్లుపై చర్చకు సమాధానం ఇస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాజ్యసభలో బిల్లు పాస్’అయిన తర్వాత, ఢిల్లీ ముఖ్యమంత్రి, అరవింద్ కేజ్రీవాల్’ కూటమి నుంచి తప్పుకుంటారని అన్నారు. అలాగే, కూటమి ఖాయంగా విచ్చిన్నం అవుతుందని జోస్యం చెప్పారు. 

నిజానికి, గత నెలలో బెంగుళూరులో నిర్వహించిన విపక్ష కూటమి సమావేశానికి ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధ్యక్షుడు  అరవింద్ కేజ్రీవాల్’ ఆప్’  కూటమిలో కొనసాగాలంటే, కాంగ్రెస్ పార్టీ బేషరుతుగా ఢిల్లీ బిల్లును వ్యతిరెకించి తీరాలని లేదంటే తమ దారి తాము చూసుకుంటామని కాంగ్రెస్ పార్టీకి షరతు విధించారు.కాంగ్రెస్ పార్టీ, జీ హుజూర్ ..ఆప్ ..జైసా బోలా ఐసాహీ కరేంగే ..( మీరు ఎలా అంటే అలా ..) అని ప్రకటించిన తర్వాతనే, కేజ్రీవాల్ బెంగుళూరు సమావేశానికి హాజరయ్యారు. అయితే ఇప్పడు, వ్రతం చెడినా ఫలితం లేకుండా పోవడంతో, కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడిందని అంటున్నారు. 

ఇటు వైసీపీ, అటు బీజేడీ ఓపెన్’ గా బిల్లుకు మద్దతు ప్రకటించడంతో, ఢిల్లీ బిల్లు పెద్దల సభలోనూ పాస్, అయినట్లే అన్న విశ్వాసం వ్యక్తమవుతోంది.ఈ విశ్వాసంతోనే, హోం మంత్రి అమిత్ షా లోక్ సభలో’ విపక్షాలకు సవాలు విసిరారని అంటున్నారు. నిజానికి, పెద్దల సభలో అధికార ఎన్డీఎ కూటమికి మెజారిటీ లేదు అందులో అనుమానం లేదు. మొత్తం 245 మంది సభ్యుల రాజ్యసభలో బీజేపీ బలం 93. బీజేపీ సొంత బలం 93 మాత్రమే అయినా మిత్రపక్షాలు, నామినేటెడ్ సభ్యులతో కలుపుకుంటే అధికారపక్షం బలం 111కు చేరుకుంటుంది. బిల్లు పాస్ అవ్వాలంటే కావాల్సిన మొత్తం సభలో హాజరైనవారిలో సగం కంటే కనీసం ఒక్క ఓటైనా ఎక్కువ రావాలి.245లో 7 స్థానాలు ఖాళీగా ఉన్నాయి.అంటే మిగిలింది 238 మంది. ఓటు వేసే సమయానికి మొత్తం అందరూ సభలోనే ఉన్నారనుకుంటే.119 మ్యాజిక్ ఫిగర్ అవుతుంది.అంటే 120 ఓట్లు బిల్లుకు అనుకూలంగా ఉంటే పాసవుతుంది.

అధికార కూటమి 111 మందితో 9 ఓట్ల దూరంలో ఆగిపోయింది. మరోవంక ఐఎన్డీఐఎ(ఇండియా) పేరుతో ఏర్పడ్డ కూటమి మొత్తం సంఖ్యాబలం రాజ్యసభలో 99. అందులో 33 మంది కాంగ్రెస్, 13 మంది తృణమూల్ కాంగ్రెస్, చెరో 10 మంది డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులున్నారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కు 7, తెలుగుదేశం, జనతాదళ్ (సెక్యులర్), బహుజన్ సమాజ్ పార్టీలకు తలా ఒక సభ్యుడు సభలో ఉన్నారు. అయితే తటస్థ పార్టీల్లో బీజేడీ, వైఎస్సార్సీపీలు తమ వైఖరి ముందే ప్రకటించాయి. రెండు పార్టీలూ బిల్లుకు సానుకూలంగా ఓటేస్తామని చెప్పాయి. అంటే బిల్లుకు సానుకూలంగా ఎన్డీఏ కూటమి 111 ఓట్లకు తోడు బీజేడీ (9), వైఎస్సార్సీపీ (9) ఓట్లను కలిపితే మొత్తం సంఖ్య 129కి చేరుకుంది. తెలుగుదేశం, జేడీ(ఎస్)లు కూడా సమర్థించే అవకాశం లేకపోలేదు. ఈ లెక్కన బిల్లు పాస్ చేసేందుకు తగినంత సంఖ్యాబలం అధికార కూటమి సంపాదించుకున్నట్టే.

ఒకవేళ ఈ తటస్థ పార్టీలను ప్రతిపక్ష కూటమి తమ వైపు తిప్పుకుని ఉంటే ఫలితం మరోలా ఉండేది. బిల్లు నెగ్గుతుందా, ఓడిపోతుందా అన్న సంగతి కాసేపు పక్కనపెడితే.. అసలు ఇండియా కూటమిలో ఉన్న పార్టీల మొత్తం ఓట్లు 99 ఒకటిగా  బిల్లుకు వ్యతిరేకంగా పడతాయా ... లేక అందులోనూ చ్చేలిక వస్తుందా ఆనందే ఇప్పుడు 26 పార్టీల కూటమి ముందున్న సవాలు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu