ఖమ్మంలో కేసీఆర్ కు కొత్త తలనొప్పులు!
posted on Aug 7, 2023 6:37AM
తెలంగాణ ఆవిర్భావం నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఖమ్మం ఉమ్మడి జిల్లా రాజకీయంగా పెద్ద తలనొప్పిగా మారుతూ వస్తోంది. గత రెండు దఫాలుగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం చతికిలబడింది. ఎన్నికల తరువాత ఇతర పార్టీల్లో గెలిచిన వారిని పార్టీలో చేర్చుకోవటం ఆ పార్టీకి పరిపాటిగా మారింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొత్తగూడెం నియోజకవర్గంలో జలగం వెంకటరావు, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి పువ్వాడ అజయ్ కుమార్‌లు మాత్రమే బీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు. అయితే, మరికొద్ది నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సత్తాచాటాలని ఆ పార్టీ అధిష్టానం భావిస్తుంది. ఈసారి పది నియోజకవర్గాల్లో విజయం సాధిస్తామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ సైతం ఈసారి జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జిల్లాలో గత ఎన్నికల ఫలితాల అనుభవంతో పాటు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం వంటి అంశాలను పరిగణనలోనికి తీసుకుని జిల్లాలో భారీ మార్పులు చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది.
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉమ్మడి జిల్లాలో పొంగులేటికి మంచి పట్టు ఉంది. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైన నాటినుంచి పొంగులేటి సీఎం కేసీఆర్‌పై విమర్శల దాడి చేస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటామని, అధికార పార్టీకి ఒక్క స్థానాన్ని దక్కనివ్వమని సవాల్ చేశారు. ఈ మేరకు మధిర ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్‌నేత భట్టి విక్రమార్కతో కలిసి పొంగులేటి ముందుకెళ్తున్నారు. పొంగులేటి వ్యూహాలకు చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్ అధిష్టానం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆశించిన ఫలితాలు రావడం లేదని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి. పలు దఫాలుగా నిర్వహించిన సర్వేల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌దే ఆధిపత్యం అని తేలిందని చెబుతున్నారు. దీంతో సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోబుతున్నారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో మూడు జనరల్ నియోజక వర్గాలు ఉన్నాయి. వీటిల్లో రెండు నియోజకవర్గాలపై కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారని తెలుస్తోంది.
మూడు జనరల్ నియోజకవర్గాల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నారు. ప్రస్తుతం అజయ్ మంత్రిగా కొనసాగుతున్నారు. . మరోసారి ఖమ్మం నియోజకవర్గం నుంచి పువ్వాడ అజయ్ కుమార్ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. పాలేరు, కొత్తగూడెం నియోజకవర్గాలపై కేసీఆర్ ప్రత్యేక దృష్టిసారించారట. పాలేరు నియోజవర్గంలో గత ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు పోటీచేసి ఓడిపోయారు. ఆ తరువాత కొద్దికాలానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన కందాల ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తుమ్మల మరోసారి ఈ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నారు. దీంతో కందాల, తుమ్మల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈసారి పాలేరు నుంచి తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆమె ఆ విషయాన్ని ప్రకటించారు. పాలేరు నియోజకవర్గంలో పార్టీ కార్యాలయాన్నిసైతం ప్రారంభించారు. ఈ క్రమంలో పాలేరులో షర్మిల బరిలో నిలిస్తే కందాల ఉపేందర్ రెడ్డికే టికెట్ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
కొత్తగూడెం నియోజకవర్గం సీఎం కేసీఆర్‌కు పెద్ద తలనొప్పిగా మారిందంటున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోదిగిన వనమా వెంకటేశ్వరరావు బీఆర్‌ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావ్‌పై విజయం సాధించారు. ఆ తరువాత ఆయన బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. అయితే, ఎన్నికల సమయంలో వనమా సమర్పించిన అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని జలగం వెంకట్రావు హైకోర్టులో కేసు వేయడంతో విచారణ చేపట్టిన కోర్టు ఎమ్మెల్యేగా వనమా ఎన్నిక చెల్లదని తీర్పి ఇచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈసారి కొత్తగూడెం నుంచి ఇద్దరిలో ఎవరిని బరిలోకి దింపుతారన్నది ప్రశ్నార్ధకంగా మారింది. మరోవైపు డీహెచ్ గడల శ్రీనివాస్‌రావు ఈసారి ఎన్నికల్లో బరిలోకి దిగాలని భావిస్తున్నారంటున్నారు. కొత్తగూడెం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు తన వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారని చెబుతున్నారు. అయితే ఈ ముగ్గురిని కాదని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్ యోచిస్గున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బరిలోకి దిగాలని భావిస్తున్నారు. పొంగులేటిని దీటుగా ఎదుర్కోవాలంటే తుమ్మల వల్లనే సాధ్యమవుతుందని కేసీఆర్ భావిస్తున్నారని అంటున్నారు. తుమ్మలను కొత్తగూడెం నుంచి బరిలోకి దింపడం ద్వారా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెక్ పెట్టొచ్చని కేసీఆర్ బలంగా నమ్ముతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, తుమ్మల మాత్రం పాలేరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. గత రెండు ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న బీఆర్ఎస్.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ హవాను తట్టుకొని ఏ మేరకు నిలబడుతుందో వేచి చూడాల్సిందే.