తిరగబడిన తెలుగు బిడ్డ!
posted on Aug 5, 2023 5:45PM
పుంగనూరులో వైసీపీ, తెలుగుదేశం శ్రేణుల మధ్య దాడులు ఏపీలో అరాచక పాలనకు తాజా నిదర్శనం. గత ఐదు రోజులుగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమం చేపట్టారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రాజెక్టులకు కేటాయించిన నిధులెన్ని, ప్రాజెక్టుల నిర్మాణంపై జగన్ మోహన్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి ఏంత? ఈ ప్రభుత్వంలో జరిగిన నష్టమెంత అన్నది ప్రజలకు వివరించడమే ఈ పర్యటన ఉద్దేశం. గత నాలుగు రోజులుగా చంద్రబాబు చేస్తున్న ఆరోపణలకు వివరణ ఇచ్చుకోలేక దిక్కులు చూస్తున్న వైసీపీ శ్రేణులు.. ముందుగా టాపిక్ డైవర్షన్ తతంగం మొదలు పెట్టారు. అయితే, చంద్రబాబు దాన్ని కూడా తిప్పికొట్టడంతో.. ఇక తమ పప్పులు ఉండకవని భావించిన వైసీపీ దాడులతో ఉద్రిక్తతలకు తెర తీసింది.
అందులో భాగమే చంద్రబాబు పుంగనూరు పర్యటనను అడ్డుకొనేందుకు వైసీపీ వందల సంఖ్యలో కార్యకర్తలను పురమాయించడం. అన్నమయ్య జిల్లా మీదగా చిత్తూరు జిల్లా పుంగనూరు వెళ్తున్న చంద్రబాబును అడ్డుకొనేందుకు అంగళ్ల నుండే వైసీపీ తన అరాచకత్వాన్ని తార స్థాయిలో ప్రదర్శించింది. పక్కా ప్రణాళికతో వైసీపీ నేతలు, కార్యకరత్తుల టీడీపీ శ్రేణులపై దాడులకు దిగారు. దీనికి పోలీసుల అండదండలు తోడవడంతో పుంగనూరు శివారు బైపాస్ రోడ్డు రణరంగంగా మారింది. చంద్రబాబును పుంగనూరులో అడుగపెట్టనివ్వబోమని వైసీపీ శ్రేణులు సవాల్ విసరడంతో టీడీపీ కార్యకర్తలు కూడా ఎలా అడ్డుకుంటారో చూస్తామని తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. వైసీపీ శ్రేణులు వందల సంఖ్యలో చేరినా.. పోలీసులు అడుగుగడుగునా టీడీపీ శ్రేణులను అడ్డుకున్నా.. టీడీపీ కార్యకర్తలు దీటుగా సమాధానం చెప్పారు.
పుంగనూరు ఘర్షణలను చూస్తే టీడీపీ తెగింపు స్పష్టంగా కనిపిస్తున్నది. గత నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు అరాచకాలను భరించి భరించి ఉన్న టీడీపీ శ్రేణులు ఇక సమరమే అన్నట్లుగా తిరగబడ్డారు. టీడీపీ అంటేనే క్రమశిక్షణకు మారుపేరుగా రాజకీయాలలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. కానీ ప్రత్యర్థి కదలికలు తనను కబళిస్తుంటే చూస్తూ ఉండే చేతగానితనం ఇసుమంతైనా ఉండకూడదని టీడీపీ నిర్ధారించుకున్నట్లు పుంగనూరు ఘటన తేటతెల్లం చేస్తున్నది. చావో రేవో ఇక ఈ అరాచకానికి చరమగీతం తప్పదనేలా పసుపు సైన్యం సమరశంఖం పూరించినట్లే కనిపిస్తుంది. తన ఉనికినే ప్రశ్నించే శత్రువుకు యుద్ధ నీతితోనే జవాబు ఇవ్వాలనే సూత్రాన్ని టీడీపీ పుణికిపుచ్చుకున్నట్లు ఈ సంఘటన కళ్ళకు కడుతున్నది.
ఇక ఎప్పుడూ శాంతం శాంతం అనే చంద్రబాబు కూడా ఒకదశలో ఇక తప్పదు సమరమే అన్నట్లుగా సంకేతాలు ఇచ్చారంటే ఇక్కడ వైసీపీ శ్రేణుల అరాచకత్వం ఏ స్థాయికి చేరిందో అర్ధం చేసుకోవచ్చు. కట్టుబాట్లు మీరకుండా తన క్యాడర్ ను నడిపించాలని భావించే చంద్రబాబు.. పుంగనూరు గూండాలపై తిరగబడాల్సిందే తమ్ముళ్లూ అంటూ అవుట్ అయిపోయారంటే ప్రభుత్వంలో పెనవేసుకుపోయిన రౌడీల పాలనలో ఎంత విసిగిపోయారో స్పష్టం అవుతున్నది.
వందల మందిని పోగేసుకొని పార్టీకి దేవాలయం లాంటి కార్యాలయంపై వీధి రౌడీల్లా దాడులు చేసినా, చట్టపరంగానే ముందుకు వెళ్దాం హింస మన సిద్ధాంతం కాదన్న చంద్రబాబు.. ఓ వైసీపీ గుండా పార్టీ అధికార ప్రతినిధి కారుపై కర్రలతో దాడికి దిగినా ప్రజలే బుద్ధి చెప్తారని సముదాయించిన చంద్రబాబు.. పార్టీకి దైవ సమానులైన కార్యకర్త రక్తం కళ్ళకి కనిపించడంతో యుద్ధ నినాదం అందుకోవాల్సి వచ్చారని భావించాల్సి ఉంటుంది. ప్రభుత్వ వ్యవస్థలన్నీ ఏకమై తమపై దాడికి దిగితే దెబ్బతిన్న సింహంలా జూలు విదిల్చి టీడీపీ వేట మొదలు పెట్టింది. హింసావాదం సమాజానికి మంచిది కానే కాదు.. కానీ, శత్రువు సమరానికి దిగిన తర్వాత తప్పదు యుద్ధమే చేయాలన్నట్లు మారిపోయింది ఇప్పుడు ఏపీలో రాజకీయం.