గ్లాస్ గుర్తు జనసేనకే.. ఏపీ హైకోర్టు తీర్పు

జనసేన పార్టీకి హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఆ పార్టీకే గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తూ ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. జనసేన పార్టీకి ఎన్నికల సంఘం గ్లాసు గుర్తును కేటాయించడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్రీయ ప్రజాకాంగ్రెస్ సెక్యులర్ పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఇటీవల తీర్పు రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తీర్పును ఈ రోజు తీర్పును వెలువరించింది. జనసేన పార్టీకి గ్లాస్ గుర్తును కేటాయించడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్రీయ ప్రజాకాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసింది. 

దీంతో జనసేనకు బిగ్ రిలీఫ్ దక్కినట్లైంది. ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థులకు కేటాయిస్తున్న బకెట్ గుర్తుతో జనసేన ఒకింత ఇబ్బందులు పడుతోంది. బకెట్ గుర్తు గ్లాసును పోలి ఉండటంతో ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ పరిస్థితుల్లో గ్లాసు గుర్తుపై పిటిషన్ దాఖలు కావడంతో  ఏం జరగబోతోందన్న ఉత్కంఠ జనసైనికుల్లో ఏర్పడింది. అయితే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో జనసేనకు భారీ ఊరట లభించినట్లైంది. 

పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గం నుంచి నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పవన్ కల్యాణ్ అన్న పేరు ఉన్న వ్యక్తి రంగంలోకి దిగారు. దీంతో పేర్ల విషయంలో ఓటర్లలో కన్ఫ్యూజన్ నెలకొనే అవకాశం ఉంటుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే బకెట్ గుర్తుతో కూడా తలనొప్పులు వచ్చే అవకాశం ఉన్నాయని అంటున్నారు. అయితే అటువంటి ఇబ్బంది పిఠాపురం నియోజకవర్గంలో తలెత్తే అవకాశం లేదని జనసైనికులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ పేరుతో నవరంగ్ కాంగ్రెస్ అభ్యర్థిని రంగంలోకి దిగినా పవన్ కల్యాణ్ ను గుర్తుపట్టని  ఓటరు ఉండరనీ, అందువల్ల పేరు విషయంలో ఎటువంటి కన్ఫ్యూజ్ ఉండదనీ, అలాగే గుర్తు విషయంలో కూడా ఓటర్లు గందరగోళంలో పడే అవకాశం లేదనీ, ఈవీఎంలో జనసేన అభ్యర్థిగా పవన్ కల్యాణ్ పొటో చూసి ఓటువేస్తారని అంటున్నారు.