కేసీఆర్, జగన్ బీజేపీ మిత్రులేనా ? మమత అందుకే పిలవడం లేదా? 

ఫెడరల్ ఫ్రంట్ పెడతానన్న నేతకు దిక్కు లేకుండా పోయిందా?ఏపీ,  తెలంగాణ ముఖ్యమంత్రులను ప్రాంతీయ పార్టీల నేతలెవరు నమ్మడం లేదా? జగన్, కేసీఆర్ ను కమలం పార్టీ మనిషిగానే చూస్తున్నారా?.. దేశ వ్యాప్తంగా జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలతో ఇదే నిజమేనని తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీ వ్యతిరేక పార్టీ నేతలతో త్వరలో సమావేశం కాబోతున్నారు. కోల్ కతాలో జరగనున్న ఈ సమావేశానికి పలు పార్టీ నేతలను మమత ఆహ్వానించారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, డీఎంకే చీఫ్ స్టాలిన్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను ఆహ్వానించారు. అయితే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డికి మాత్రం కోల్ కతా ఆహ్వానం రాలేదు. మమతా బెనర్జీ సమావేశానికి తెలుగు రాష్ట్రాల నేతలకు ఆహ్వానం రాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ను మమత ఎందుకు పట్టించుకోవడం లేదన్న చర్చ జాతీయ రాజకీయాల్లో జరుగుతోంది.

 ప్రస్తుతం బెంగాల్ లో టీఎంసీ, బీజేపీ మధ్య యుద్దమే నడుస్తోంది. బెంగాల్ లో పనిచేస్తున్న ఐపీఎస్ లను రాష్ట్ర సర్కార్ తో సంబంధం లేకుండా కేంద్రం బదిలీ చేయడంపై మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ అంశంలో డీఎంకే అధినేత స్టాలిన్, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కెప్టెన్ అమరీందర్ సింగ్, భూపేష్ భగల్, అశోక్ గెహ్లాట్‌ మమతకు మద్దతుగా నిలిచారు. కేసీఆర్ మాత్రం స్పందించలేదు. అటు జగన్ కూడా మాట్లాడలేదు.  బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పై మోడీ, అమిత్ షా లాంటి వారు నిప్పులు చెరుగుతుంటే ఇతర బీజేపీయేతర ముఖ్యమంత్రులు మమతకు అండగా నిలిచారు కానీ సీఎం కేసీఆర్ మాత్రం మద్దతుగా నిలవలేదు. గతంలో ఫెడరల్ ఫ్రంట్ పేరుతో మమతను కలిసిన కేసీఆర్.. బీజేపీపై యుద్దం చేస్తానన్న కేసీఆర్.. బీజేపీతో చిక్కులు ఎదుర్కొంటున్న మమతా బెనర్జీకి బాసటగా నిలవకపోవడం ఇతర ప్రాంతీయ పార్టీ నేతలను విస్మయపరిచిందని చెబుతున్నారు. కేసీఆర్ కేంద్రంపై ఎన్ని విమర్శలు చేసినా.. ఆయన్ను బీజేపీ సపోర్టర్ గానే చూస్తున్నారట ప్రాంతీయ పార్టీల నేతలు. ఫెడరల్ ఫ్రంట్ ప్రకటన కూడా కాంగ్రెస్ ను ఇరుకున పెట్టేందుకే బీజేపీ డైరెక్షన్ లో వచ్చిందేనని కొందరు చెబుతున్నారు. ఈ కారణాల వల్లే కేసీఆర్ ను తన సమావేశానికి మమత బెనర్జీ పిలవలేదని తెలుస్తోంది.

రాజకీయాల్లో కేసీఆర్ ఎప్పుడూ ఏ స్టాండ్ తీసుకుంటారో తెలియని పరిస్థితి నెలకొంది.  బీజేపీకి వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ పెడతానని పలు సార్లు ప్రకటించారు గులాబీ బాస్. 2019 పార్లమెంట్ ఎన్నికలకు ముందు కొంత వర్కవుట్  కూడా చేశారు. భువనేశ్వర్ వెళ్లి నవీన్ పట్నాయక్, చెన్నైలో స్టాలిన్ ను కలిశారు కేసీఆర్. బెంగళూరులో కుమారస్వామి, లక్నోలో మాయావతిని కలిసి చర్చించారు. కోల్ కతా వెళ్లి మమతా బెనర్జీతోనూ ఫెడరల్ ఫ్రంట్ పై చర్చలు జరిపారు కేసీఆర్. శరద్ పవార్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తోనూ సంప్రదింపులు జరిపానని చెప్పుకొచ్చారు. కేసీఆర్ హడావుడి చూసిన వారంతా ఆయన ఫెడరల్ ఫ్రంట్ పెట్టడం ఖాయమనుకున్నారు. కాని లోక్ సభ ఎన్నికల తర్వాత ఆయన సైలెంట్ అయ్యారు. ఇటీవల తెలంగాణలో బీజేపీ బలం పుంజుకోవడంతో  గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా మళ్లీ ఫెడరల్ ఫ్రంట్ ఆలోచన తెరపైకి తీసుకొచ్చారు కేసీఆర్. వ్యవసాయ చట్టాలు, ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసీ, ఎయిరిండియా, బొగ్గు గనులు వంటివి ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ మోడీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. ఇంకా చెప్పాలంటే మోడీ ప్రభుత్వంపై ఒక యుద్ధమే ప్రకటించారు గులాబీ బాస్. అయితే  గ్రేటర్ ఎన్నికల తర్వాత మళ్లీ మెత్తబడ్డారు కేసీఆర్. ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి వచ్చారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించిన సీఎం కేసీఆర్ ఆ సమయంలో రైతు సమస్యలను ప్రస్తావించలేదని సమాచారం . 

కేసీఆర్ తీరు, ఎప్పుడు ఏం మాట్లాడుతారో తెలియకపోవడంతో ప్రాంతీయ పార్టీ నేతలెవరు ఆయనను నమ్మడం లేదని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ముందు నుంచి బీజేపీతో సఖ్యతగానే ఉంటున్నారు. రైతులు వ్యతిరేకిస్తున్న కొత్త వ్యవసాయ చట్టాలను పార్లమెంట్ లో సమర్ధించింది వైసీపీ. జగన్ కూడా ఇటీవలే ఢిల్లీకి వెళ్లి అమిత్ షాను కలిసి వచ్చారు. దీంతో జగన్ ను కూడా బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలు నమ్మడం లేదని తెలుస్తోంది. అందుకే వీరిద్దరిని మమతా బెనర్జీ సమావేశానికి ఆహ్వానించలేదనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మమతా బెనర్జీ సమావేశానికి కేసీఆర్ కు ఆహ్వానం రాకపోవడంపై తెలంగాణ కాంగ్రెస్ నేత కొండా విశ్వేశర్ రెడ్డి కూడా  హాట్ కామెంట్స్ చేశారు. మమతతో పాటు, శరద్ పవార్, స్టాలిన్, నవీన్ పట్నాయక్‌లు కేసీఆర్‌ను నమ్మడం లేదని చెప్పారు.  బీజేపీ మరియు టీఆర్ఎస్‌లు రెండు రహస్య ఒప్పందంపై పయనిస్తూ ప్రజలను పిచ్చివారిని చేస్తున్నాని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీకి సీఎం కేసీఆర్ భయపడ్డారేమో అందుకే ఢిల్లీ వెళ్లి రాజీ చేసుకున్నారని కొండా ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఎందుకు ఉన్నఫలంగా స్టాండ్ మార్చుకుంటున్నారని కొండా విశ్వేశర్ రెడ్డి ప్రశ్నించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu