అవినీతి పాలన అందించగల ఏకైక నాయకుడు జగనేనన్న వైసీపీ ఎమ్మెల్యే!
posted on Dec 22, 2020 3:07PM
'అవినీతి పాలన అందించగల ఏకైక నాయకుడు భారతదేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారా అంటే... అది జగన్ మాత్రమే' . ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో ప్రతిపక్ష పార్టీకి చెందిన నేత కాదు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే. విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు... సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే మాటలకు అక్కడున్న వైసీపీ నేతలంతా చప్పట్లు కొట్టారు. అయితే అసలు విషయం గ్రహించి తర్వాత అంతా నాలుక కరుచుకున్నారు. ఎందుకంటే జగన్ ను ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు పొరపాటున చేసినవి. జగన్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే నీతివంతమైన పాలన అనబోయి పొరపాటున అవినీతి పాలన అని అనేశారట. ఎమ్మెల్యే ఏం మాట్లాడారో గమనించకుండానే పక్కనున్న నేతలు, వైసీపీ కార్యకర్తలు చప్పట్లు కొట్టడం ఇక్కడ మరో విశేషం.
రాజకీయ నాయకులు ప్రసంగించేటప్పుడు ఒక్కోసారి పొరపాటున చేసే వ్యాఖ్యలు వారిని ఎంతో ఇబ్బందిలోకి నెడుతుంటాయి. చిన్న స్థాయి నేతలే కాదు పెద్దపెద్ద నాయకులు కూడా మాటల మధ్యలో నాలుక జారుతూ కష్టాల్లో పడుతుంటారు. ఆ తర్వాత సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు.. సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వైసీపీ ఎమ్మెల్యే నిజమే మాట్లారంటూ టీడీపీ శ్రేణులు కామెంట్ చేస్తున్నారు. ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు.