శరద్ పవార్ దారెటో తేలిపోయిందా?
posted on Apr 21, 2023 11:47AM
విపక్షాల ఐక్యత కోసం అలుపెరుగకుండా ప్రయత్నాలు చేస్తున్న శరద్ పవార్ ఇప్పుడు అదే విపక్ష కూటమికి దూరమౌతున్నారా? విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్న పారిశ్రామిక వేత్త అదానికి మద్దతుగా మాట్లాడుతున్నారు. దీంతో ఆయన రాజకీయ రూటు మారిందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
అదానీ, మోడీ నెక్సస్ పై విపక్షాలు విమర్శలు చేస్తుంటే.. పవార్ మాత్రం అదానీ, మోడీ సంబంధం, మోడీ విద్యార్హత తప్ప మరో సమస్యే లేదా అంటూ చిటపటలాడుతున్నారు. దీంతోనే ఆయన విపక్షాల ఐక్యతకు కాకుండా విచ్ఛిన్నానికి ప్రయత్నిస్తున్నారా? కమలానికి దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
పరిశీలకులు సైతం అదే దారిలో విశ్లేషణలు చేశారు. ఆ అనుమానాలకూ, విశ్లేషణలకూ బలం చేకూర్చే విధంగా అదానీతో శరద్ పవార్ బేటీ అయ్యారు. పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ స్వయంగా ముంబైలోని శరద్ పవార్ నివాసానికి వెళ్లి మరీ భేటీ అయ్యారు. వీరిరువురి మధ్యా జరిగిన చర్చలేమిటన్నది పక్కకు పెడితే.. హిడెన్ బర్గ్ నివేదిక తరువాత అదానీపై వెల్లువెత్తుతున్న విమర్శలు, జేపీసీ కోసం విపక్షాల డిమాండ్ నూ పట్టించుకోకుండా కేంద్రం నిర్మొహమాటంగా అదానీకి మద్దతుగా నిలిచిన నేపథ్యంలో శరద్ పవార్, అదానీ బేటీ రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
పైపెచ్చు విపక్షాల విమర్శలను ఖండిస్తూ పవార్ అదానీకి మద్దతుగా నిలవడంతో ఈ భేటీ రాజకీయ ప్రాముఖ్యతను సైతం సంతరంచుకుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో శరద్ పవార్ కేంద్రానికి మద్దతుగా నిలిచే అవకాశాలను కొట్టిపారేయలేమని పరిశీలకులు అంటున్నారు.