పార్టీల దయ ... బీసీల ప్రాప్తం!
posted on Jul 26, 2025 3:16PM

ఈసారికి రిజర్వేషన్లు హుళుక్కేనా?
ఓ వంక స్థానిక సంస్థల ఎన్నికలపై సందిగ్దత కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర హై కోర్టు ఆదేశించిన విధంగా సెప్టెంబర్ 30లోగా ఎన్నికల నిర్వహించడం సాధ్యమవుతుందా లేదా అనేది ఒకటైతే.. ఈలోగా 42 శాతం రిజర్వేషన్ వివాదం అటో ఇటో తేలుతుందా లేదా అనేది మరో చిక్కుముడి. నిజానికి.. హై కోర్టు విధించిన గడవులోగా ఎన్నికలు నిర్వహించం ఒక్కటే సమస్య అనుకుంటే అదసలు సమస్యే కాదు. అంతకంటే ముందుగా అయినా నిర్వహించడం కూడా పెద్ద విషయం కాదు. అందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధంగా వుంది. కానీ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన విధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయడం విషయంలోనే అనేక చిక్కుముళ్లు ఎదురుతున్నాయి. అందుకే.. బీసీలకు చట్టబద్దంగా 42 శాతం రిజర్వేషన్ కల్పించి.. హై కోర్ట్ విధించిన గడువు లోగా ఎన్నికలు నిర్వహించడం ఇంచుమించుగా అయ్యే పని కాదని రాజకీయ పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్లుందని పరిశీలకులు భావిస్తున్నారు.
నిజానికి రాష్ట్రంలోగ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30లోగా నిర్వహించాలని ఆదేశించిన రాష్ట హై కోర్టు మొదటి 30 రోజుల్లో రిజర్వేషన్లను ఖరారు చేయాలని, ఆ తర్వాతి 2 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. రిజర్వేషన్ల ఖరారుకు హై కోర్టు విధించిన గడువు శనివారం (జులై 26) ముగుస్తోంది.
అందుకే.. రాజకీయ పార్టీల స్వరం మెల్ల మెల్లగా మారుతోంది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ.. అటు 42 శాతం బీసీ రిజర్వేషన్ కు చట్టబద్దత సాధించేందుకు కేంద్ర ప్రభుత్వంతో పోరాటం కొనసాగిస్తూనే.. ఇటు రాష్ట్ర హై కోర్టు ఆదేశాలను గౌరవిస్తూ.. ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన మాట మేరకు,పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్’ కలిపించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.అధికారికంగా, అలాంటి ప్రతిపాదన ఏదీ రాకున్నా’, ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ ముఖ్యనాయకులు అందరూ కేంద్రం మెడలు వచుతాం, చట్టం తెస్తామని చెపుతున్నా.. అది సాద్యం కాదని కాంగ్రెస్ నాయకులకు అర్థమైందని అంటున్నారు. అందుకే.. కేంద్ర ప్రభుతం అడ్డుకున్నా, కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు 42 శాతం అమలుచేస్తామని, మీడియా చర్చల్లో కాంగ్రెస్ నాయకులు కొత్త రాగం అందుకున్నారు.
మరోవంక.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా.. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయక పోయినా తాము మాత్రం పార్టీలో బీసీలకు 42 శాతం పదవులు ఇస్తామని స్పష్టం చేశారు. మరో వంక బీఆర్ఎస్ మౌనంగా పరిస్థితిని గమనిస్తోందని, బీసీలకు ఇచ్చిన 42 రిజర్వేషన్ పక్కన పెట్టి ఎన్నికలకు పోతే.. ఇటు కాంగ్రెస్ పార్టీని, అటు బీజేపీని ప్రజాకోర్టులో దోహిగా నిలబెట్టవచ్చన్న ఆలోచనతో బీఆర్ఎస్’ నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఏది ఏమైనా ఈసారికి 42 శాతం రిజర్వేషన్ మాత్రం హుళక్కే అంటున్నారు.