ప్రపంచంలో అత్యం విశ్వసనీయ నేతగా నరేంద్రమోడీ మరోసారి
posted on Jul 26, 2025 2:58PM

ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేతగా భారత్ ప్రధాని నరేంద్రమోడీ మరోసారి టాప్‌లో నిలిచారు. అమెరికా ప్రెసిడెంట్‌గా రెండో సారి ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ విశ్వసనీయత ప్రపంచంలో ఎనిమిదో స్థానానికి పడిపోయింది. మార్నింగ్ కన్సల్ట్ సంస్థ గ్లోబల్ లీడర్ సర్వేలో మోడీ మరోసారి తన ఆధిక్యాన్ని నిలుపుకున్నారు. సర్వేలో ప్రధాని మోడీకి అత్యధిక శాతం మంది మద్దతు ప్రకటించడంలో అప్రూవల్ రేటింగ్స్ ఏకంగా 75 శాతానికి చేరాయి. ఈ ఏడాది జులై 4 నుంచి 10 తేదీల మధ్య సర్వేను నిర్వహించారు.
ఈ సర్వేలో ప్రధాని నంబర్1గా నిలవడంపై బీజేపీ సీనియర్ నేత అమిత్ మాల్వీయ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా మిలియన్‌ల మంది ప్రజల గౌరవాభిమానాలు చూరగొన్న నేతగా ప్రధాని నిలిచారని అన్నారు. అత్యధిక అనుకూల రేటింగ్స్ కలిగిన నేతగా ఉన్నారంటూ ప్రశంసల్లో ముంచెత్తారు. బలమైన నాయకత్వం, ప్రపంచవ్యాప్తంగా గౌరవాభిమానాలు పొందే నేత సారథ్యంలో భారత్ భద్రంగా ఉందని కామెంట్ చేశారు.
మార్నింగ్ కన్సల్ట్ నిర్వహిస్తున్న సర్వేల్లో మోడీ 2021 నుంచి ప్రథమస్థానంలోనే కొనసాగుతున్నారు. సర్వేల్లో ప్రధానికి మద్దతుగా నిలుస్తున్న వారి సంఖ్య 70 శాతానికి పైగానే ఉంటోంది. 2022 సర్వేలో కూడా 13 ప్రపంచం నేతల్లో జనాదరణ పరంగా ప్రధాని టాప్‌లో నిలిచారు. ఇక 2023 నాటి సర్వేలో ఆయన అప్రూవల్ రేటింగ్స్ 76 శాతానికి ఎగబాకాయి. గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన సర్వేలో విశ్వసనీయత రేటింగ్స్ గరిష్ఠంగా 78 శాతాన్ని తాకాయి. తాజా సర్వేలో ప్రధాని తర్వాతి స్థానంలో దక్షిణ కొరియా నేత లీ జే మ్యూంగ్ ఉన్నారు. 59 శాతం అప్రూవల్ రేటింగ్స్‌తో ఆయన రెండో స్థానంలో నిలిచారు. ఆ తరువాతి స్థానాల్లో అర్జెంటీనా నేత జేవియర్ మైలీ (57 శాతం), కెనడా అధినేత మార్క్ కార్నీ (56 శాతం) ఉన్నారు. ఇక ఈ జాబితాలో 44 శాతం అప్రూవల్ రేటింగ్స్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎనిమిదో స్థానంలో నిలిచారు.