బసవతారకం ఆస్పత్రి సిల్వర్ జూబ్లీ వేడుకలు.. పాల్గొన్న గవర్నర్
posted on Jun 22, 2025 3:08PM

హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆస్పత్రి ఛైర్మన్ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడారు. సిల్వర్ జూబ్లీ సందర్భంగా బసవతారకం ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది, మేనేజ్‌మెంట్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. క్యాన్సర్ వ్యాధితో మరణించిన ఎన్‌టీఆర్ సతీమణి బసవతారకం పేరు మీద 25 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఈ ఆస్పత్రి.. ఇప్పటివరకు లక్షల మంది రోగులకు వైద్య సేవలు అందించిందని గుర్తుచేశారు.ఎన్టీఆర్ ఐకానిక్ లీడరని, లెజెండరీ యాక్టరని మంత్రి కొనియాడారు. ఈ సందర్బంగా ఆస్పత్రి ఛైర్మన్ బాలయ్య మాట్లాడుతు తన తల్లి బసవతారకం కోరిక మేరకు ఈ క్యాన్సర్ ఆస్పత్రి స్థాపించటం జరిందని అన్నారు.
క్యాన్సర్ పేషెంట్స్‌కు అండగా ఉండటం కోసం ఎంతో మంది దాతలు ఆస్పత్రికి సహాయ సహకారాలు అందించారని పేర్కొన్నారు. డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనో లేక లాభాలు పొందాలనే ఆశతోనో ఈ ఆస్పత్రిని ప్రారంభించలేదని ఈ సందర్భంగా బాలకృష్ణ చెప్పారు. తనకు దామోదర రాజ నరసింహ పేరుతో ఒక సినిమా చేయాలని ఉందన్నారు. 110 పడకలతో మొదలై.. నేడు దేశంలోనే అత్యున్నత ఆస్పత్రుల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. త్వరలోనే 1000 పడకలతో అమరావతిలోనూ క్యాన్సర్ వైద్యశాల ఏర్పాటు చేస్తాం. మొదటి దశలో 300 పడకలతో ప్రారంభిస్తాం. మాకు అన్నివిధాలుగా సహకారం అందిస్తోన్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు, ముఖ్యమంత్రులకు ధన్యవాదాలు’’ అని బాలయ్య అన్నారు.
బాలకృష్ణ దాతృత్వం కలిగిన నటుడు, నేత. పేదలకు మంచి వైద్యం అందించాలనేదే బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి లక్ష్యమని గవర్నర్ జిష్ణుదేవ్ అన్నారు . రానున్న కాలంలోనూ పేదలకు మెరుగైన సేవలు అందించాలని కోరుకుంటున్నామని ఆయన తెలిపారు. తెలంగాణలో ప్రతి ఏటా 50 నుంచి 55 వేల మంది కొత్తగా క్యాన్సర్ బారిన పడుతున్నారని మంత్రి రాజనర్సింహ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్లను ప్రారంభించబోతున్నామని మంత్రి తెలిపారు. ప్రతి జిల్లాలో క్యాన్సర్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. త్వరలోనే వీటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని, క్యాన్సర్ స్క్రీనింగ్, డయాగ్నొస్టిక్, డే కేర్ కీమోథెరపి, పాలియేటివ్ కేర్ వంటి సేవలన్నీ ఈ సెంటర్లలో అందిస్తామని అన్నారు.