ర‌వీంద‌ర్‌సింగ్‌తో ఈట‌ల స్కెచ్‌.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కేసీఆర్‌కు రిట‌ర్న్ గిఫ్ట్‌..

ఏ ఎన్నికైనా ఈజీగా గెలుస్తామ‌నుకున్నారు. అధికార బ‌లంతో విర్ర‌వీగారు. డ‌బ్బులు వెద‌జ‌ల్లితే ఏ ప‌నైనా అవుతుంద‌నుకున్నారు. కానీ, కేసీఆర్ దూకుడుకు హుజురాబాద్‌లో చెక్ పెట్టారు ఈట‌ల రాజేంద‌ర్‌. గులాబీ బాస్‌ను ఢీకొట్టి గెలిచాక.. కేసీఆర్‌కు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు ఈట‌ల‌. క‌రీంన‌గ‌ర్‌లో మాజీ మేయ‌ర్ ర‌వీంద‌ర్‌సింగ్ టీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేసి.. ఇండిపెండెంట్ కేండిడేట్‌గా స్థానిక సంస్థ‌ల‌ ఎమ్మెల్సీ బ‌రిలో దిగారు. సింగ్ వెనుక‌.. హుజురాబాద్ కింగ్ ఉన్నార‌ని అంటున్నారు. ఈట‌ల రాజేంద‌రే ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ చేప‌ట్టి.. ర‌వీంద‌ర్ సింగ్‌ను టీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు లాగి.. ఎమ్మెల్సీ బ‌రిలో నిలిపార‌ని అంటున్నారు. జ‌స్ట్ పోటీ చేయించ‌డ‌మే కాదు.. ఎమ్మెల్సీగా ర‌వీంద‌ర్ సింగే గెలుస్తార‌ని ఈట‌ల ధీమాగా చెబుతున్నారు. 

ర‌వీంద‌ర్‌సింగ్‌తోనే ఆగిపోద‌ని.. క‌రీంన‌గ‌ర్ జిల్లా నుంచి అనేక మంది టీఆర్ఎస్ నాయ‌కులు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నార‌ని ఈట‌ల రాజేంద‌ర్ అంటున్నారు. ఒక్క క‌రీంన‌గ‌ర్ అనే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్‌కు షాకుల మీద షాకులు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఆదిలాబాద్‌లో కూడా ZPTC  రాజేశ్వరరెడ్డిని.. ఎమ్మెల్సీ పోటీలో పెట్టించింది తానేన‌ని ఈట‌ల చెప్పారు.  

కేసీఆర్ ప‌ని అయిపోయిందని.. ఆయ‌న ఆరిపోయే దీపమ‌ని ఈట‌ల అన్నారు. త‌న‌ను అవ‌మానించి.. అవినీతి ఆరోప‌ణ‌లు చేసి.. మంత్రిమండ‌లి నుంచి వెళ్ల‌గొట్టి.. పార్టీని వీడేలా చేసి.. హుజురాబాద్‌లో ఓడించే ప్ర‌య‌త్నం చేసిన కేసీఆర్‌కు తాను చుక్క‌లు చూపిస్తానంటూ శ‌ప‌థం చేశారు ఈట‌ల రాజేంద‌ర్‌. అన్న‌ట్టుగానే.. క‌రీంన‌గ‌ర్ మాజీ మేయ‌ర్ ర‌వీంద‌ర్‌సింగ్‌తో తొలిపావు క‌దిపారు. ఎమ్మెల్సీగా గెలిపిస్తాన‌ని కూడా చెప్పారు. అదే జ‌రిగితే.. ర‌వీంద‌ర్‌సింగ్ ఎమ్మెల్సీగా గెలిస్తే.. ఇక ఈట‌ల చెప్పిన‌ట్టుగానే.. కేసీఆర్ ప‌ని అయిపోయిన‌ట్టే..అంటున్నారు.