వణికిస్తున్న కొవిడ్ కొత్త వేరియంట్.. ప్రధాని మోడీ హై లెవల్ మీటింగ్

ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం క్రమంగా తగ్గుతుందని అనుకుంటున్న సమయంలోనే మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. పుట్టుకొస్తున్న కొవిడ్ కొత్త వేరియంట్‌లు దేశాలను వణికిస్తున్నాయి.  సౌతాఫ్రికా పొరుగు దేశమైన బోత్సవానాలో కరోనా కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. B.1.1529 పేరు కలిగిన ఈ వేరియంట్‌ వేగంగా ప్రబలుతోంది. ఇప్పటికే 22 కేసులను గుర్తించినట్లుగా ఎన్ఐసీడీ తెలిపింది. 

దక్షిణాఫ్రికాలో కరోనా వైరస్‌ కొత్త రకాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పటివరకు ఏ రకంలోనూ లేని విధంగా ఈ కొత్త రకం కొమ్ముల్లో భారీగా ఉత్పరివర్తనాలు జరిగినట్టు వారు ఆందోళన చెందుతున్నారు. కొత్త వేరియంట్‌ వివరాలను లండన్‌ ఇంపీరియల్‌ కళాశాల వైరాలజిస్ట్‌ డాక్టర్‌ టామ్‌ పీకాక్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఇది ఆందోళనకరమైన వేరియంటేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది ఎంత వేగంగా విస్తృతంగా వ్యాపిస్తుందనే సంకేతాలను వారు గమనిస్తున్నారు. స్పైక్‌ మ్యుటేషన్లు (కరోనా వైరస్‌పై కొమ్ముల్లాంటి వాటిలో ఉత్పరివర్తనాలు) పెద్దసంఖ్యలో జరుగడం ఆందోళన కలించే అంశమని హెచ్చరిస్తున్నారు. 

B.1.1529 కొత్త వేరియంట్‌ వైరస్ వ్యాప్తిని నిపుణులు, డబ్ల్యూహెచ్‌ఓ అంచనా వేస్తోంది. HIV రోగిలోంచి ఈ రకం వేరియంట్‌ పుట్టుకొచ్చినట్లుగా భావిస్తున్నారు. ఈ కొత్త వేరియంట్ ప్రస్తుతం ఏ స్థాయిలో ఉందో తెలియదంటున్న నిపుణులు ఫ్యూచర్‌లో వైరస్ వ్యాప్తి పెరిగితేనే ముప్పు అంటున్నారు.ఇది భారీగా వ్యాపించడానికి, ప్రజల రోగ నిరోధకతను తప్పించుకొనేందుకు వైరస్‌కు బలాన్నిస్తుందని విశ్లేషిస్తున్నారు. దక్షిణాఫ్రికాలో ఇప్పటికే 22 కొత్త వేరియంట్‌ కేసులను గుర్తించారు. అర్హులంతా కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని, మాస్కులు ధరించాలని, పరిశుభ్రత, భౌతిక దూరం పాటించాలని, గాలి వెలుతురు ధారాళంగా ఉన్న ప్రదేశాల్లోనే సమావేశం కావాలని దక్షిణాఫ్రికా ప్రభుత్వం ప్రజలకు సూచించింది. కొత్త వేరియంట్‌పై లండన్‌లో కూడా పరిశోధనలుజరుగుతున్నాయి.

హైదరాబాద్ యూనివర్శిటీలో కరోనా పంజా.. థర్డ్ వేవ్ వచ్చినట్టేనా? 

కొత్త వేరియంట్ ఎంట్రీతో కర్నాటకలో కోవిడ్‌ కేసులు మళ్లీ పెరిగాయి. ధార్వాడ్‌లోని ఓ మెడికల్ కాలేజీలో 182 మంది స్టూడెంట్స్‌కు కరోనా సోకింది. ఒడిశా వైద్య కళాశాలలో కూడా 54 మందికి పాజిటివ్‌ రావడంతో నాలుగు హాస్టళ్లను మైక్రో కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటించారు. పది రోజులపాటు ప్రత్యక్ష తరగతులను సస్పెండ్ చేశారు. హైదరాబాద్ లోని టెక్ మహీంద్రా యూనివర్శిటీలోనూ కరోనా పంజా విసిరింది. 25 మందికి పాజిటివ్ నిర్దారణ అయింది. క్యాంపస్ లో కేసుల సంఖ్య మరింతగా పెరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 

దక్షిణాఫ్రికాలో B.1.1.529 కొత్త వేరియంట్‌ పుట్టుకొచ్చిందన్న వార్తతో భారత్‌ అలర్ట్ అయింది. B.1.1.529 స్పైక్ ప్రోటీన్‌లో 32 మ్యుటేషన్లు ఉన్నట్లుగా భావిస్తోంది. దీంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అలెర్ట్ చేసింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను పూర్తిగా మూడంచెల స్క్రీనింగ్‌ చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు.

కోరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్న దేశాల నుంచి వెంటనే విమాన సర్వీసులను నిలిపివేయాలని ప్రధాని మోదీని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరారు. ఎంతో కృషి, ఎన్నో కష్టాల తర్వాత మన దేశం కరోనా నుంచి కోలుకుందని చెప్పారు. ఈ కొత్త వేరియంట్ మన దేశంలోకి ప్రవేశించకుండా ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్నీ తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కొత్త వేరియంట్ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పాలని నిపుణులను కోరానని తెలిపారు.

ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ప్రధాని నరేంద్ర మోడీ కూడా అప్రమత్తమయ్యారు. ఢిల్లీలో ఆరోగ్య శాఖ అధికారులతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. దేశంలో కొవిడా తాజా పరిస్థితి, కొత్త వేరియంట్ , తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.