‘ఆటోనగర్ సూర్య’ విడుదలకు సమస్య!
posted on Jun 21, 2014 3:30PM

నాగచైతన్య, సమంత జంటగా నటించిన ‘మనం’ సినిమా ఈమధ్య విడుదలై ఘన విజయం సాధించింది. దీంతో వీరిద్దరు కలసి నటించిన మరో చిత్రం ‘ఆటోనగర్ సూర్య’ చిత్రం మీద ప్రేక్షకులలో ఆసక్తి పెరిగింది. దేవా కట్టా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ సినిమాని ఈనెల 27న విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమాని విడుదల చేయడానికి వీల్లేదంటూ ఒక ఫైనాన్షియర్ కోర్టును ఆశ్రయించారు. తాను ఈ సినిమా కోసం రెండు కోట్లు రుణం ఇచ్చారని, తన రుణం తీర్చకుండానే సినిమాని విడుదల చేస్తున్నారంటూ గుంటూరుకు చెందిన ఒక ఫైనాన్షియర్ కోర్టుకు తెలిపారు. దాంతో కోర్టు ఈ సినిమాని జులై 10వ తేదీ వరకు విడుదల చేయరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో మరోసారి ‘ఆటోనగర్ సూర్య’ చిత్రం విడుదలకు అవరోధాలు ఏర్పడ్డాయి.