‘ఊహలు గుసగుసలాడే’ బుజ్జి రివ్యూ!
posted on Jun 20, 2014 3:22PM
.jpg)
బ్యానర్: వారాహిచలనచిత్రం, నటీనటులు: నాగశౌర్య, రాశి ఖన్నా, నిర్మాత: సాయి కొర్రపాటి, దర్శకత్వం: శ్రీని అవసరాల. ఇది ముగ్గురు వ్యక్తుల కథ. నాగశౌర్య (న్యూస్ రీడర్), శ్రీని అవసరాల (టీవీ ఛానల్ ఓనర్), రాశీ ఖన్నా (డెంటిస్ట్) వీరే ఆ ముగ్గురు వ్యక్తులు. నాగ శౌర్య రాశీ ఖన్నాని చూసీ చూడగానే లవ్వులో పడిపోతాడు. అయితే నాగ శౌర్య ప్రేమ ప్రతిపాదనని రాశీ ఖన్నా చెత్తబుట్టలో పారేస్తుంది. దాంతో ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు. ఆ తర్వాత నాగ శౌర్య శ్రీని అవసరాల ఓనర్ అయిన టీవీ ఛానల్లో న్యూస్ రీడర్‌గా చేరతాడు. పెళ్ళీడు వచ్చిన శ్రీని అవసరాల తనకు నచ్చే అమ్మాయి కోసం వెతుకుతూ వుంటాడు. ఒక సందర్భంలో రాశీ ఖన్నా ఫొటో చూసి అతను కూడా లవ్వులో పడిపోతాడు. ఆమెనే పెళ్ళి చేసుకోవాలని డిసైడ్ అయిపోతాడు. ఆ తర్వాత ఈ ముగ్గురి మధ్య ఎలాంటి డ్రామా జరిగిందనేది ఈ సినిమా కథ. కామెడీ, రొమాన్స్ సమపాళ్ళలో కలసిన సినిమా ఇది. పాత తరహా కథతో రూపొందిన సినిమా అయినా కథనం కొత్తగా వుంటుంది. సినిమా చూస్తున్నంతసేపూ ఫ్రెష్ సినిమా చూస్తున్న ఫీల్ కలుగుతుంది. ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయమైన నాగ శౌర్య నటుడిగా మంచి మార్కులనే సంపాదించుకున్నాడు. అతనికి ఈ సినిమా శుభారంభాన్ని ఇచ్చింది. ఇక కథానాయిక రాశీ ఖన్నా ఈ సినిమాలో చాలా ప్రాధాన్యం వున్న కథానాయిక పాత్ర ధరించింది. ముద్దుముద్దుగా కనిపిస్తూ చక్కని నటన ప్రదర్శించింది. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా కూడా మారిన అవసరాల శ్రీనివాస్ తనదగ్గర విషయం వుందని నిరూపించుకున్నాడు. నిర్మాణ విలువలతో చిత్రాలను రూపొందించే వారాహి సంస్థ తమ స్థాయిలోనే ఈ సినిమాని నిర్మించింది.