గవర్నర్ వద్దకు వైసీపీనేతల బృందం ఎందుకంటే?
posted on Jun 28, 2025 6:22AM

జగన్ లో అరెస్టు భయం పీక్స్ కు చేరింది. జగన్ రెంటపాళ్ల పర్యటలో ఆయన కారు కింద పడి వైసీపీ కార్యకర్త మరణించిన సంఘటనపై జగన్ ఏ2గా కేసు నమోదైంది. ఆ కేసును కొట్టేయాలంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. జగన్ క్వాష్ పిటిషన్ పై కోర్టు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. విచారణను జులై 1కి వాయిదా వేసింది. అయితే కోర్టు విచారణను వాయిదా వేస్తూ జులై 1 వరకూ జగన్ పై ఎటువంటి చర్యలూ తీసుకోవద్దని పోలీసులను ఆశ్రయించింది. అంత మాత్రానికే కోర్టు జగన్ ను నిర్దోషిగా భావంచిందంటూ వైసీపీ నేతలూ, కార్యకర్తలూ అంటున్నారు. కానీ వాస్తవానికి ఈ కేసులో అరెస్టు తప్పదేమోనన్న భయం జగన్ లోనూ, ఆ పార్టీ నేతలలోనూ కనిపిస్తోంది. అందుకే ఇంత కాలం లేనిది ఇప్పుడు హడావుడిగా వైసీపీ నేతల బృందం గవర్నర్ అబ్దుల్ నజీర్ ను గురువారం (జూన్ 26) కలిసి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తమపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందంటూ ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు, మండలిలో వైసీపీ పక్షనేత, బొత్స సత్యనారాయణ నేతృత్వంలో వైసీపీ నేతలు గవర్నర్ అబ్దుల్ నజీర్‌ని కలిశారు. మాజీ సిఎం జగన్ పర్యటనలలో భద్రత కల్పించడం లేదని, ఆయనపై కూడా తప్పుడు కేసులు నమోదు చేస్తోందని ఫిర్యాదు చేశారు.
వాస్తవానికి జగన్ రెంటపాళ్ల పర్యటన ఆద్యంతం పోలీసు ఆంక్షలను, నిబంధనలనూ తుంగలోకి తొక్కుతూ సాగింది. వంద మందితో మాత్రమే రెంటపాళ్లకు వెళ్లాలని పోలీసులు జగన్ కు అనుమతి ఇస్తే.. దానిని ఖాతరు చేయకుండా వేలాది మందితో వెళ్లారు. జగన్ కాన్వాయ్ లో మూడు కార్లకే అనుమతి ఉంటే ఆయన పెద్ద సంఖ్యలో కార్లతో వెళ్లారు. అంతే కాకుండా అడుగడుగునా పోలీసులతో ఘర్షణ పడుతూ శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా చేశారు. జగన్ వాటిని ప్రోత్సహిస్తున్న చందంగా అభివాదాలు చేశారే తప్ప వారించలేదు.పైపెచ్చు తరువాత తాపీగా నా కారుకుంది పడి మా పార్టీ కార్యకర్త మరణిస్తే నాకు బాధకలగదా?అంటూ..సంగమయ్య కుటుంబానిి పార్టీ తరఫున పదిలక్షలు ఇచ్చాం కదా అని చెబుతున్నారు. తన కారు కింద పడే సింగమయ్య మరణించాడని తద్వారా అంగీకరించేశారు. అయినా సరే తనపై తప్పుడు కేసు నమోదు చేశారంటూ దబాయిస్తున్నారు. ఆ కేసులో తనని అరెస్ట్ చేస్తారనే భయంతో జగన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా వేశారు.
ఆ క్వాష్ పిటిషన్ పై కోర్టు ఇంకా విచారించాల్సి ఉంది. కానీ అంతలోనే తమ పార్టీ నేతలను గవర్నర్ వద్దకు పంపించి సిఎం చంద్రబాబు నాయుడు, ప్రభుత్వంపై ఎదురు పిర్యాదు చేయడం చూస్తే సింగమయ్య మృతి కేసులో అరెస్ట్ చేస్తారేమోనని జగన్ భయంతో వణికిపోతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.