హైదరాబాద్ ఏపీ సెక్రటేరియట్ ఇక తెలంగాణకే..

హైదరాబాద్‌లోని సచివాలయంలో ఇక ఆంధ్రప్రదేశ్ ఆనవాళ్లు కనిపించవు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం హైదరాబాద్‌లో ఉన్న సచివాలయాన్ని పదేళ్లపాటు వాడుకునేందుకు ఏపీ ప్రభుత్వానికి కేంద్రం అవకాశం కల్పించింది. దీని ప్రకారం సచివాలయంలోని ఎనిమిది బ్లాకుల్లో ఎల్‌, నార్త్ హెచ్, నార్త్ సౌత్, జె, కె బ్లాకులు ఏపీకి..ఏ,బీ,సీ,డీ బ్లాకులు తెలంగాణకు వచ్చాయి. ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇరు ప్రభుత్వాలు తమకు కేటాయించిన బ్లాకుల నుంచి పరిపాలనను మొదలుపెట్టాయి. అయితే ఇద్దరు చంద్రుల మధ్య వివాదాలు రావడం అవి తీవ్రతరం కావడంతో జరిగిన రాజకీయ పరిణామాల కారణంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మాకాంను విజయవాడకు మార్చారు. పరిపాలనను యావత్తూ ఆయన బెజవాడ నుంచే కానిస్తున్నారు. ఆయనతో పాటు మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా విజయవాడ, గుంటూరు నగరాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నారు.

 

ఇప్పుడు హైదరాబాద్ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ కూడా రాజధాని ప్రాంతానికి వచ్చేయాల్సిందిగా సీఎం ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఉద్యోగులంతా అమరావతి బాట పట్టడానికి రెడీ అవుతున్నారు. ఉద్యోగులు ఆ బ్లాక్‌లను ఖాళీ చేస్తే అవన్నీ ఖాళీగానే పడి ఉంటాయి. దాంతో బ్లాకుల నిర్వహణ వ్యయం కూడా ప్రభుత్వానికి భారమే. ఇప్పటికే ప్రతీ బ్లాక్ నిర్వహణకు సర్కార్ ప్రతీ నెల సగటున రూ.10 లక్షలు వ్యయం చేస్తోంది. దీంతో సచివాలయాన్ని ఖాళీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్క ఎల్ బ్లాక్ మినహా మిగిలిన బ్లాక్‌లను ఈ నెల 27న అప్పగిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ , తెలంగాణ సీఎస్ రాజీవ్‌శర్మకు లేఖ రాశారు. మొత్తానికి సచివాలయం నుంచి ఆంధ్రప్రదేశ్ అన్న పదం మటు మాయం కానుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu