కంచికి చేరుతుందనుకొన్న కధ మళ్ళీ మొదలయిందా?

 

తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రతీ చర్యకీ తప్పక సమాన ప్రతిచర్య ఉంటుందని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ముందు నుండే హెచ్చరిస్తుండటం అందరికీ తెలిసిందే. ఆ హెచ్చరికలను నిజం చేస్తూ నిన్న అర్ధరాత్రి ఆంధ్రా పోలీసులు టీ-న్యూస్ ఛానల్ యాజమాన్యానికి నోటీసులు అందజేశారు. ఎన్‌వీవీ ప్రసాద్‌ అనే న్యాయవాది విశాఖపట్నం పోలీస్ స్టేషన్ లో టీ-న్యూస్ ఛానల్ పై చేసిన ఒక పిర్యాదుపై స్పందిస్తూ విశాఖ నగర ఎసిపి రమణ నిన్న అర్ధరాత్రి కి టీ-న్యూస్ ఛానల్ సిఈఓ నారాయణ రెడ్డికి బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 10లోని టీ-న్యూస్‌ ప్రధాన కార్యాలయంలో నోటీసులు అందజేసారు.

 

నామినేటడ్ ఎమ్యల్యే ఎల్విస్ స్టీఫెన్ సన్ తో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడినట్లు చెప్పబడుతున్న ఆడియో టేపులను జూన్ 7వ తేదీ రాత్రి 8.30 గంటలకు టీ-న్యూస్ ఛానల్ ప్రసారం చేసి టెలిగ్రాఫిక్ చట్టంలోని సెక్షన్: 19ని ఉల్లంఘించినందుకు నోటీసు జారీ చేస్తున్నట్లు, దానికి మూడు రోజులలోగా సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. టీ-న్యూస్ ఛానల్ ఉద్దేశ్యపూర్వకంగానే ఆ ఆడియో టేపులను ప్రసారం చేసి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రతిష్టను దెబ్బ తీసేందుకు ప్రయాణించిందని, కనుక దానిపై చట్టపరమయిన చర్యలు తీసుకోవలసిందిగా న్యాయవాది ఎన్‌వీవీ ప్రసాద్‌ తన పిర్యాదులో కోరారు. ఆయన పిర్యాదు ఆధారంగానే టీ-న్యూస్ ఛానల్ కి నోటీసు జారీ చేయబడింది.

 

అయితే ఎసిపి రమణ టీ-న్యూస్ ఛానల్ కి నోటీసు అందజేయడానికి వెళ్లేముందు తమకు ఆ విషయం గురించి ముందుగా తెలియజేయనందుకు తెలంగాణా పోలీస్ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనుక బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ అధికారులు కూడా విశాఖ నగర ఎసిపి రమణకి బహుశః నోటీసు ఇస్తారేమో?

 

గత రెండు రోజులుగా తెలంగాణా ఎసిబి అధికారులు ఎటువంటి తీవ్రమయిన చర్యలు చేప్పట్టకపోవడంతో, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తగ్గబోతున్నాయేమోననే ఊహాగానాలు వినిపించాయి. కానీ కంచికి చేరుతుందనుకొన్న కధ మళ్ళీ మొదటికి వచ్చినట్లు కనబడుతోంది. కనుక ఈరోజు తెలంగాణా ఎసిబి అధికారులు కూడా మరొక అడుగు ముందుకు వేస్తారేమో? అప్పుడు మళ్ళీ ఆంద్ర, తెలంగాణా రాష్ట్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం మొదలవవచ్చును.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu