ఆంధ్రా, తెలంగాణా జలవివాదాలకు పరిష్కారం

 

ఆంద్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల మధ్య ఏడాదిగా సాగుతున్న జల వివాదాలకు కేంద్రజలవనరుల శాఖ ఎట్టకేలకు ఒక పరిష్కారం కనుగొంది. ఈరోజు డిల్లీలో కేంద్రజలవనరుల శాఖ కార్యదర్శి అమరేందర్ సింగ్ సమక్షంలో సమావేశమయిన కృష్ణానది జలసంఘం సభ్యులు కృష్ణా నదీ జలాల పంపకాల కోసం ఇరు రాష్ట్రాల అధికారులతో కూడా ఒక తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేసుకొన్నారు. దీనిలో ఇరు రాష్ట్రాల ఈ.యన్.సి.లు, కేంద్రజలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ సభ్యులుగా ఉంటారు. శ్రీశైలం మరియు నాగార్జున సాగర్ గేట్ల నిర్వహణ భాద్యతలు పూర్తిగా ఈ తాత్కాలిక సంఘానికే అప్పగించబడ్డాయి. దిగువనున్న ఆయకట్టు రైతుల నీటి అవసరాలను బట్టి ఆ తాత్కాలిక సంఘమే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని నీరు విడుదల చేస్తుంటుంది. నీటి విడుదల, ప్రాజెక్టు గేట్ల నిర్వహణ విషయంలో ఆ కమిటీదే తుది నిర్ణయం. అందులో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు, అధికారులు ఎవరూ కూడా జోక్యం చేసుకోకూడదు. ఆ తాత్కాలిక కమిటీ సభ్యులు నీటి విడుదలలో ఏకాభిప్రాయానికి రాలేకపోయినా, మళ్ళీ వారి మధ్య వివాదం చెలరేగినా దాని గురించి కేంద్ర జలవనరుల ప్రధాన కార్యదర్శికి మాత్రమే నివేదించాలి.

 

ఈరోజు జరిగిన సమావేశంలో శ్రీశైలం, నాగార్జునసాగర్ మరియు ప్రకాశం బ్యారేజీల నుండి రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు కూడా పూర్తి చేసారు. వీటిలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి 164 టీయంసీలు, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 519 టీయంసీలు, ప్రకాశం బ్యారేజీ నుంచి 181.2 టీయంసీల నీళ్ళు కేటాయించారు. అదేవిధంగా తెలంగాణా రాష్ట్రానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి 100 టీయంసీలు, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 299 టీయంసీల నీళ్ళు కేటాయించారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ తాత్కాలిక కమిటీ నిర్ణయాలలో జోక్యం చేసుకోనట్లయితే ఈ సమస్యకు ఇదే శాశ్విత పరిష్కారం అవుతుందని భావించవచ్చును. ఈ ప్రయత్నం సఫలమయితే గోదావరి జలాల పంపకాలకు కూడా ఇదే సూత్రం అమలుచేయవచ్చును.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu