లిక్కర్ స్కాం బిగ్‌బాస్ జగన్ .. అరెస్టుకు సోమిరెడ్డి డిమాండ్

 

ఏపీ లిక్కర్ స్కాంపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా విచారణ చేపట్టింది. ఈ కేసు విషయంలో సిట్ అధికారులు వేగంగా దర్యాప్తు జరుపుతున్నారు.  ఈ స్కాంలో ఎవరున్నా విడిచి పెట్టవద్దని ఏపీ ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. దీంతో సిట్ అధికారులు ఈ కేసు విషయంలో దూకుడు పెంచారు. ఆ క్రమంలో ఇప్పటికే ఇదే కేసులో రాజ్ కసిరెడ్డిని అదుపులోకి తీసుకున్న సెట్ అధికారులు తాజాగా మరో కీలక వ్యక్తి సజ్జల శ్రీధర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపధ్యంలో మాజీమంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ లిక్కర్ స్కాంకి అసలు బిగ్ బాస్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్ అని , ముందు  ఆయన్ని జైలుకు సోమిరెడ్డి డిమాండ్ చేశారు. బిగ్ బాస్ దురాశ వల్ల నాసిరకం మద్యం తాగి ఎందరో పేదలు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. 

మద్యం కుంభకోణం విషయంలో వెంటనే కేంద్రం జోక్యం చేసుకుని సీబీఐ, ఈడీని రంగంలోకి దింపాలని అన్నారు. నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. మద్యపానం నిషేధ హామీతో అధికారంలోకి వచ్చి, మద్యంతో పేదల ప్రాణాలు తీయటం క్షమించరాని నేరమని అన్నారు. జగన్ జమానాలో జరిగిన లిక్కర్ కుంభకోణంలో ఇప్పటి వరకూ రూ.3200కోట్లు మాత్రమే సీఐడీ వెలికితీసిందని, అనధికార లావాదేవీలు ఇంకా పెద్దమొత్తంలో జరిగాయని ఆరోపణలు గుప్పించారు. జగన్ జమానాలో జరిగిన లిక్కర్ స్కామ్ ఓ అంతర్జాతీయ కుంభకోణమని షాకింగ్ కామెంట్స్ చేశారు. రూ.1.35లక్షల కోట్లు నగదు రూపంలో బదిలీ చేసి డిజిటల్ ఆంధ్రాని కాస్తా క్యాషాంధ్రగా మార్చారని విమర్శించారు. జగన్ హయాంలో అడిగిన లంచాలు ఇవ్వలేక నాటి వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మెక్ డోవెల్స్ కంపెనీని మూసేసుకున్నారని అన్నారు. మొత్తానికి సోమిరెడ్డి చేస్తున్న ’బిగ్‌బాస్ అరెస్ట్‘ డిమాండ్ వైరల్‌గా మారుతోందిప్పుడు