బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సర్వం సిద్ధం..గులాబీ మయం అయిన ఎల్కతుర్తి
posted on Apr 26, 2025 6:32PM

బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో 1,213 ఎకరాల్లో రజతోత్సవ సభ నిర్వహిస్తున్నారు. 500 మంది కూర్చునేలా గులాబీ రంగులతో వేదికను తీర్చిదిద్దారు. వేదిక పక్కనే కళాకారుల ఆట-పాట కోసం ప్రత్యేకంగా మరో స్టేజ్‌ను ఏర్పాటుచేశారు. సభకోసం రాష్ట్రంలోని నలుమూలల నుంచి దాదాపు 50 వేల వాహనాల వస్తాయని అంచనా వేస్తున్నారు. పార్కింగ్ కోసం 1,059 ఎకరాలను కేటాయించారు. సభకు వచ్చే ప్రజల కోసం లక్షకు పైగా కుర్చీలను ఏర్పాటు వేశారు. గులాబీ దళపతి కేసీఆర్ అందరికీ స్పష్టంగా కనిపించేలా 20/50 సైజుతో కూడిన 23 ఎల్‌ఈడీ భారీ స్క్రీన్లు, భారీ సౌండ్ సిస్టంను చుట్టుపక్కల ఏర్పాటుచేశారు. 500 మంది కూర్చునే సామర్థ్యంతో వేదిక గులాబీ రంగులతో అద్భుతంగా తీర్చిదిద్దారు. వేదిక పక్కనే కళాకారుల ఆట-పాట కోసం ప్రత్యేకంగా మరో వేదికను ఏర్పాటుచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే దాదాపు 50 వేల వాహనాల కోసం 1,059 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. వీఐపీ వాహనాల కోసం సభావేదిక ఎడమ భాగం, వెనుక భాగంలో పార్కింగ్‌ను ఏర్పాటుచేశారు. మహాసభ ప్రాంగణంలో వాహనాలు, ప్రజలు వచ్చేందుకు వీలుగా గ్రీన్, రెడ్ కార్పెట్లు ఏర్పాటుచేశారు.
బహిరంగ సభకు ఐదు చోట్లా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయగా, వాహనాల మళ్లింపు, ఇతర సేవల కోసం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 2 వేల మందికిపైగా వలంటీర్లను అందుబాటులో ఉంచారు. ఈ మేరకు వారికి ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ ఇచ్చి వాహనాల మళ్లింపుతో పాటు జనాలకు అవసరమైన సేవలందించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే వారందరికీ ట్రైనింగ్ కూడా ఇచ్చినట్లు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. విద్యుత్తు సరఫరా అందించేందుకు 200కుపైగా జనరేటర్లు పెడుతున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. ఇదిలాఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చే కరెంట్ పై తమకు నమ్మకం లేదని, అందుకే 200కుపైగా జనరేటర్లు ఏర్పాటు చేసినట్లు తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వ్యాఖ్యానించడం గమనార్హం. వైద్య సేవల కోసం బృందాలు సభకు 10 లక్షల మంది వరకు వస్తారని పార్టీ అంచనా వేస్తుండగా, ఎండల నేపథ్యంలో అక్కడ వందకు పైగా వైద్య బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ నేతలు పేర్కొన్నారు.
అంతేగాకుండా ఎమర్జెన్సీ సేవల కోసం 15 అంబులెన్సులు, 10 లక్షల వాటర్ బాటిల్స్, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో పెడుతున్నారు. అంతేగాకుండా ఎక్కడికక్కడ తాత్కాళిక టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశారు. రజతోత్సవ సభ నిర్వహణకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా, పార్టీ నేతలు జన సమీకరణపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే జిల్లాలు, నియోజకవర్గాల వారీగా పార్టీ ఇన్ఛార్జులను నియమించి, కార్యకర్తలతో సమావేశాలు కూడా నిర్వహించారు. ఇప్పటికే దూర ప్రాంతాల నుంచి ఎండ్ల బండ్లతో పాటు పాదయాత్రలతో పార్టీ కార్యకర్తలు ఎల్కతుర్తి సభా ప్రాంగణానికి బయలుదేరారు. రేపు (27వ తేదీ) సాయంత్రం వరకు సభ ప్రారంభం కానుండగా, సాయంత్రం 4 గంటలలోగా కార్యకర్తలు సభా ప్రాంగణానికి చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని గులాబీ నేతలు సూచిస్తున్నారు.