10 రోజులపాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
posted on Sep 18, 2025 2:56PM
.webp)
ఏపీ అసెంబ్లీ పది రోజులపాటు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఆరు ఆర్డినెన్సుల స్థానంలో కొత్త బిల్లులు తీసురావాలని భావిస్తున్నారు. దీంతో సెప్టెంబర్ 30 తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా 20, 21, 28 తేదీల్లో శాసన సభకి సెలవులు ఉండనున్నాయి. సభలో చర్చించేందుకు 18 అంశాలను టీడీపీ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. 9 అంశాలను బీజేపీ ప్రతిపాదించింది. ప్రశ్నోత్తరాలతో పాటు శూన్య గంటలోనూ మంత్రులు ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
జీఎస్టీ సంస్కరణలపై నేడు శాసనసభలో చర్చ జరుగుతుంది. 19న జలవనరుల అంశం, 22న శాంతి భద్రతలు, 23న వైద్యారోగ్యం, 24న పరిశ్రమలు, 25న సూపర్-6, 26న క్వాంటం వ్యాలీ, 27న లాజిస్టిక్స్, 29న స్వర్ణాంధ్ర దిశగా ఏపీ, 30న రాయలసీమ-కోస్తా-ఉత్తరాంధ్ర అభివృద్ధి అంశంపై చర్చ జరగనుంది.
నేటి నుంచి శాసన సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయంలో అసెంబ్లీ, మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలిచ్చారు. రాష్ట్రంలో యూరియా కొరతపై చర్చించాలని వైసీపీ సభ్యులు మండలిలో తీర్మానం ప్రవేశపెట్టగా ఛైర్మన్ దానిని తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు శాసనమండలి నుంచి వాకౌట్ చేశారు.