బూరుగు రమేష్, విక్రాంత్ నివాసాల్లో ముగిసిన ఈడీ సోదాలు
posted on Sep 18, 2025 2:31PM

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం (సెప్టెంబర్ 18) ఉదయం నుంచీ దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలలో సోదాలు నిర్వహిస్తున్న సంగతి విదితమే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహి స్తున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం ఇరవై చోట్ల ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో 3,500 కోట్ల సొమ్మును దారిమళ్లించారన్న ఆరోపణలపై ఈడీ నిర్వహిస్తున్న ఈ సోదాలలో భాగంగా మారేడుపల్లిలోని వెల్డింగ్టన్ ఎన్ క్లేవ్ లో నివాసం ఉంటున్న వ్యాపారవేత్త బూరుగు రమేష్, ఆయన కుమారుడు విక్రాంత్ నివాసాలలో దాదాపు ఏడుగంటల పాటు నిర్వహించిన సోదాలు ముగిశాయి.
ఈ సోదాలలో ఈడీ కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. కాస్పో లీగల్ సర్వీసెస్, మహదేవ జ్యువెల్లరీస్ తో పాటు రాజశ్రీ ఫుడ్స్ లో బూరుగు విక్రాంత్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఈ కంపెనీలలోకి ఏపీ మద్యం కుంభకోణం కేసు నగదు మళ్లించినట్లు ఈడీ గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ సోదాల్లో భాగంగా బూరుగు రమేష్ నివాసంలో నగదు, షెల్ కంపెనీల పత్రాలు సీజ్ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. స్వాధీనం చేసుకున్న పత్రాలు నగదును హైదరాబాద్ ఈడీ కార్యాలయానికి తరలించారు.
ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 12 మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వీరిలో ముగ్గురికి బెయిల్ లభించింది. కాగా నకిలీ ఇన్వాయిస్, పెంచిన మద్యం ధరలతో అక్రమంగా సొమ్ములు వివిధ ప్రాంతాలకు చేరవేసినట్లు ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు ఈడీలు సోదాలు జరుగుతున్నాయి. ఈ స్కామ్ కు సంబంధించి ఐదు రాష్ట్రాల్లో లింకులున్నాయని గుర్తించిన ఈడీ ఇప్పుడు ఈ సోదాలు నిర్వహిస్తోంది.