జూబ్లీ ఉపఎన్నిక వేళ కాంగ్రెస్ కు బిగ్ షాక్!?
posted on Sep 18, 2025 3:05PM

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సమయం దగ్గరపడుతున్న వేళ అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు అమీర్ అలీఖాన్ తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవితతో భేటీ అయ్యారు. ఈ భేటీ తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారింది. గచ్చిబౌలిలోని ఒక నాయకుడి నివాసంలో గురువారం (సెప్టెంబర్ 18) ఈ భేటీ జరిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గత ఏడాది జనవరిలో సీనియర్ నేత అమీర్ అలీఖాన్ ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కాంగ్రెస్ అవకాశం ఇచ్చింది. అయితే గవర్నర్ కోటాలో వీరికి ఎమ్మెల్సీ పదవులను ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అప్పట్లో సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై కొద్ది నెలల కిందట సుప్రీం తీర్పు వెలువరించింది.
అమీర్ అలీఖాన్, ఆయనతో పాటుగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయిన ప్రొఫెసర్ కోదండరామ్ ల నియామకాలపై స్టే విధించింది. సుప్రీం కోర్టు స్టే పై కాంగ్రెస్ పెద్దగా స్పందించలేదు. కోదండరామ్ ను మళ్లీ ఎమ్మెల్సీని చేసి తీరుతామని చెప్పిన రేవంత్ అమీర్ అలీఖాన్ విషయంలో మాత్రం ఏమీ మాట్లాడలేదు. సరే గత నెలలో కోదండరాంతో పాటు మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవులు కేటాయించిన కాంగ్రెస్ అమీర్ అలీఖాన్ ను పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే తీవ్ర అసంతృప్తితో ఉన్న అమీర్ అలీఖాన్ సమయం చూసి కాంగ్రెస్ కు షాక్ ఇచ్చారని ఆయన కవితతో భేటీ ద్వారా తెలుస్తోంది.