టికెట్ల ధ‌ర‌ల్లో సినిమా ట్విస్టులు.. హైకోర్టు తీర్పు ఎవ‌రికి అనుకూలం?

సింగిల్ జ‌డ్జి మీ ఇష్టం అన్నారు. సినిమా టికెట్లు పెంచుకోవ‌చ్చ‌ని గుడ్‌న్యూస్ చెప్పారు. టాలీవుడ్ మొత్తం సంబ‌ర‌ప‌డింది. కానీ, అది ముడ్నాళ్ల‌ ముచ్చ‌టగా మారింది. సింగిల్ జ‌డ్జి తీర్పును స‌వాల్ చేస్తూ ఏపీ ప్ర‌భుత్వం డివిజ‌న్ బెంచ్‌కు వెళ్లింది. అక్క‌డ మేట‌ర్ మ‌ళ్లీ మొద‌టికొచ్చింది. స్టే ఇవ్వ‌కున్నా.. తీర్పును కాస్త మార్చింది. థియేటర్ యజమానులు టికెట్ ధరల ప్రతిపాదనలను జాయింట్ కలెక్టర్ ముందు ఉంచాలని.. టికెట్ ధరలపై జేసీ నిర్ణయం తీసుకోవాల‌ని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. ఇక‌, గత ఆదేశాల ప్ర‌కారం టికెట్ ధరల నిర్ణయంలో ప్రభుత్వ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇదీ.. మేట‌ర్‌. 

ఇంత‌కీ హైకోర్టు తీర్పు ఎవ‌రికి అనుకూలం? ఇంకెవ‌రికి ప్ర‌తికూలం? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇటు ప్ర‌భుత్వం, అటు థియేట‌ర్లు.. ఇద్ద‌రిలో ఎవ‌రికైనా లాభం జ‌రగొచ్చు అంటున్నారు. అయితే, కండిష‌న్స్ అప్లై. టికెట్ ధ‌ర‌ల‌ను ఇంత పెంచుతామంటూ ముందుగా థియేట‌ర్ యాజ‌మాన్యాలు జేసీకి ప్ర‌తిపాద‌న‌లు పంపాలి. అయితే, ప్ర‌భుత్వంలో భాగంగా ఉండే జేసీ.. స్వ‌తంత్రంగా నిర్ణ‌యం తీసుకుంటారా? ఆయ‌న్ను అలా సొంతంగా నిర్ణ‌యం తీసుకోనిస్తారా? అనేదే ఇక్క‌డ కీల‌కాంశం. ప్ర‌భుత్వం జాయింట్ కలెక్ట‌ర్ల‌పై ఒత్తిడి పెంచి టికెట్ ధ‌ర‌ల పెంపును క‌ట్ట‌డి చేసే అవ‌కాశం లేక‌పోలేద‌ని అంటున్నారు. జేసీలు అంతఃక‌ర‌ణ‌శుద్ధితో డెసిష‌న్ తీసుకుంటారా? అలా తీసుకోనిస్తారా? అనేదే ఆస‌క్తిక‌రం.  

పాల‌కులు చెప్పినట్టు జేసీలు నడుచుకునేలా ఒత్తిడి చేస్తారా? అలా ప్ర‌భుత్వం నుంచి ప్రెజ‌ర్ వ‌చ్చే అవకాశం లేక‌పోలేద‌ని అనుమానిస్తున్నారు. అయితే.. జేసీలు కనుక పరిధి దాటి వ్యవహరిస్తే.. వారికి న్యాయ‌ చిక్కుల్లో త‌ప్ప‌వు. ఇప్ప‌టికే ప‌లువురు సీనియ‌ర్ ఐఏఎస్‌లు కోర్టులో దోషిగా నిల‌బ‌డిన సంద‌ర్భాలు ఏపీలో అనేకం ఉన్నాయి. ఇలా.. అటూఇటూ తిరిగి సినిమా టికెట్ల ధ‌ర‌ల వ్వ‌వ‌హారం జేసీల కోర్టులోకి వ‌చ్చిప‌డింది. మ‌రి, జాయింట్ క‌లెక్ట‌ర్లు.. సినిమాకు, థియేట‌ర్ల‌కు అనుకూలంగా న్యాయం వైపు నిల‌బ‌డ‌తారా? లేక‌, ఎప్ప‌టిలానే త‌మ‌పై వ‌చ్చే ఒత్తిళ్ల‌కు వంగిపోతారా? అనేదానిపై కొత్త సినిమాలు, పెద్ద సినిమాల భ‌విష్య‌త్తు ఆధార‌ప‌డి ఉంది. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu