రాజకీయాల్లో పవన్ ఎందుకు ఫెయిలయ్యారు?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాల సంగతి ఎలా ఉన్నా రాజకీయాలలో మాత్రం రాణించ లేక పోతున్నారు. కొంచెం ఆలస్యంగానే అయినా  ఆయనే ఆ నిజాన్ని అంగీకరించారు. రాజకీయాల్లో  తాను ‘ఫెయిల్’ అయ్యానని అయినా, రాజకీయాలను వదిలి వెళ్లనని, పోరాటం కొనసాగిస్తానని ప్రకటించారు. బాగుంది కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఎందుకు రాణించలేక పోతున్నారు? ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? లోపం ఎక్కడ వుంది? అంటే, అందుకు కర్ణుడి చావుకు ఉన్నన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును, ఉండవచ్చును కాదు  ఉన్నాయి.  

కానీ ఆయన ఫెయిల్యూర్ కు ఒక ప్రధాన కారణం మాత్రం ఆయన చేస్తున్న జోడు పడవల ప్రయాణం. ఇటు సినిమాల్లో, అటు రాజకేయాల్లో ఇటో కాలు అటో కాలు అన్నట్లు ప్రయాణం చేయడం వలన సామాన్య జనం ఆయన్ని ఇంకా సినిమా హీరోగా చూస్తున్నారే తప్ప సీరియస్ పొలిటికల్ స్టార్ గా గుర్తించడం లేదు. అందుకే  ఆయన మీటింగులకు వస్తున్నారు. చూస్తున్నారు. ఆయన చెప్పే డైలాగు వింటున్నారు చప్పట్లు కొడుతున్నారు. సినిమా చూసినట్లు చూస్తున్నారు. వెళుతున్నారు. అంతే తప్ప ఆయన్ని రాజకీయ నాయకుడిగా గుర్తించడంలేదు. అందుకే  ఆయన రాజకీయాల్లో రాణించ లేక పోతున్నారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఒక విధంగా ఆయనకున్న హీరో ఇమేజే రాజకీయాల్లో ఆయన జీరో ఇమేజ్ కి కారణం అవుతోందని విశేషకులు అంటున్నారు. 

అయితే సినిమాలు వదులు కునేందుకు పవన్ కళ్యాణ్  సిద్ధంగా లేరు. అలాగని అన్న చిరంజీవి అడుగుజాడల్లో రాజకీయాలకు చుక్క పెట్టి  సినిమాలకు పరిమితయ్యే ఆలోచన కూడా పవన కళ్యాణ్ కు లేదు. చిరంజీవి రాజకీయాలు వదిలేసినా  రాజకీయాలు ఆయన్ని వదలడం లేదు (సినిమాలో కాదు నిజంగానే)  అలాగే  పవన్ కళ్యాణ్ కు అదో ఇదో ఏదో ఒకటి వదిలించుకునే ఆలోచన వుందో లేదో కానీ, అటు రాజకీయాలు, ఇటు సినిమాలు రెండూ కూడా పవన్ కళ్యాణ్ ను వదలడం లేదని ఆయన సన్నిహితులు, అభిమానులు అంటున్నారు.

ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి  కానీ, పవన్ కళ్యాణ్ ఏదీ వదులుకునే పరిస్థితిలో లేరు. సినిమాలు వదులు కుంటే పార్టీ నడవదు. రాజకీయాలు వదులు కుంటే, చిరంజీవి అన్నయ్యలా, ఇంచక్కా చిందులు, విందులలో మునిగి తెల వచ్చును. కానీ, పవన్ కళ్యాణ్ ఇంకా  అందుకు సిద్దం అయినట్లు లేరు.అదలా ఉంటే  ఓ వంక ఏపీలో ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఎన్నికల కురుక్షేత్రానికి సిద్దమవుతున్నాయి. అస్త్రశస్త్రాలు సిద్దం చేసుకుంటున్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు  జిల్లాలో పర్యటిస్తున్నారు. జనం బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలైంది. ఆయన పరుగుల్లో ఆయనున్నారు.  మరోవంక టీడీపీ యువనాయకుడు లోకేష్ పాదయాత్రకు సిద్దమవుతున్నారు. చివరకు స్టేట్ పాలిటిక్స్ లో స్టేక్ లేని బీజేపీ , కాంగ్రెస్, వామ పక్ష పార్టీలు కూడా ఏంతో కొంత హడావిడి చేస్తున్నాయి. 

ఆలాగని  జనసేన ఏమీ చేయకుండా చేతులు ముడుచుకు కూర్చుందని కాదు కానీ, సర్వం తానైన పవన్ కళ్యాణ్  ఏ మేరకు పార్టీకి సమయం ఇవ్వగలరు అనేదే ఇప్పుడు జన సైనికుల ముందున్న ప్రశ్న.  నిజానికి జనసేన ప్రచార రథాలు ఇంచుమించుగా సంవత్సరం క్రితమే సిద్ధమయ్యాయి. జిల్లాల్లో ప్రచారం కోసం బయలుదేరి వెళ్ళాయి, కానీ, ప్రచారం మాత్రం అంతగా పట్టాలు ఎక్కలేదు. మరోవంక జనవరి 2023 నుంచి, పవన్ కళ్యాణ్ బస్సుయాత్ర  ప్లాన్ చేసుకున్నారు. బస్సు కూడా రెడీ అయింది.అయితే, పవన్ కళ్యాణ్ బస్సు యాత్రకు ఎంత వరకు డేట్స్ ఇవ్వగలరనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరసగా వస్తున్న సినిమా ప్రకటనలు గమనిస్తే, ఎన్నికల చివరి సంవత్సరంలో అయినా పవన్ కళ్యాణ్ పార్టీకి సమయం కేటాయించగలరా అనేది అనుమానంగానే ఉందని అంటున్నారు. 

ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న హరిహర వీరమల్లు కంప్లీట్ అవడానికి జనవరి వరకూ పడుతుంది.. ఆ తర్వాత వెంటనే మరో రెండు సినిమాల షూటింగ్‌లో పాల్గొంటారని ఆయా సినిమాల రూపకర్తలు ప్రకటించారు. సుజిత్ డైరక్షన్‌లో ఓ సినిమాను కొత్తగా ఎనౌన్స్ చేయగా.. గతంలోనే ప్రకటించిన హరీష్ శంకర్ దర్శకత్వంలోని సినిమా కూడా వచ్చే వారం నుంచే ప్రారంభమవుతుందని.. హరీష్ శంకరే ప్రకటించారు. ఎలా లేదన్నా ఒక్క సినిమా షూటింగ్‌కు కనీసం నాలుగు నెలలు పడుతుంది. మరి కొన్ని కమిట్ మెంట్స్ కూడా ఉన్నాయి.ఇవ్వన్నీ అయ్యే సరికి పుణ్యకాలం పూర్తయి ఎన్నికల రానే వస్తాయి. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్  బస్సు యాత్ర మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పటికే ఒకటి రెండు సార్లు వాయిదా పడిన బస్సు యాత్ర అనుకున్నవిధంగా జనవరిలో మొదలవుతుందా? మొదలైనా, నిరాటంకంగా జరుగుతుందా, షూటింగుల మధ్యలో, ‘గ్యాప్’ యాత్రలు చేస్తారా అన్నదానిపై ఇప్పటికే స్పష్ట్టత లేదు. సో.. పవన్ కళ్యాణ్  రాజకీయాల్లో ఎందుకు రాణించలేక పోతున్నారో, ఎందుకు ఫెయిల్ అయ్యారో అర్థమైంది. కానీ, ఆయన సినిమాలు చేయకపోతే, రాజకీయం చేయలేరు, సినిమాలు చేస్తే రాజకీయాలలో రాణించలేరు, పెళ్ళైతే కానీ పిచ్చి కుదరదు.. పిచ్చి కుదిరితే గానీ, పెళ్లి కాదు.  పీకేది ..అదే .. అదే డైలమా ...