ఉద్యోగుల ఉద్యమ భేరీ.. జగన్ సర్కార్ ఉక్కిరిబిక్కిరి!

ఆంధ్రప్రదేశ్ సర్కార్ నెత్తిన మరో పిడుగు పడబోతోంది. అసలే ఖజానా దివాలా తీసి, దొరికిన చోటల్లా అప్పులు చేసి దినదిన గండంగా నెట్టుకొస్తున్న జగన్రెడ్డి సర్కార్పై ఉద్యోగ సంఘాలు వజ్రాయుధాన్ని ప్రయోగించబోతున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాలు ఉద్యమ భేరి మోగించాయి. రాష్ట్ర సర్కార్తో ఢీ అంటే ఢీ అనేందుకు రెడీ అయ్యాయి. పీఆర్సీ నివేదికకు అతీగతీ లేదని, డీఏ బకాయిలకు దిక్కు లేకుండా పోయిందని, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ డబ్బులు ఏమయ్యాయని, ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని పరిస్థితి లేకుండా పోయిందని ఏపీ జేఏసీ, జేఏసీ అమరావతి సంఘాలు ఉద్యమ నగారా మోగించాయి. డిసెంబర్ 1 నుంచి జనవరి 6 వరకు తొలిదశ ఆందోళనలు నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. ఉద్యమ కార్యాచరణకు సంబంధించి డిసెంబర్ 1న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి.

ఉద్యమంలో భాగంగా డిసెంబర్ 7-10 తేదీల మధ్య నల్ల బ్యాడ్జీలతో అన్ని ఆఫీసులు, స్కూళ్లు, తాలూకా పరిధిలోని ఆఫీసులు, డివిజన్, జిల్లాస్థాయి ఆఫీసులు, ఉన్నతాధికారుల ఆఫీసులు, ఆర్టీసీ డిపోల్లో ప్రభుత్వానికి నిరసనలు తెలపాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. 13న అన్ని మండలాలు, డివిజన్లలో నిరసన ర్యాలీలు, ప్రదర్శనలు, కాన్ఫరెన్స్లు నిర్వహిస్తామని జేఏసీ నేతలు తెలిపారు. డిసెంబర్ 16న తాలూకా, డివిజన్ అధికారుల ఆఫీసులు, ఆర్టీసీ డిపోల్లో ఉదయం 9 నుంచి, మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నాలు చేయాలని డిసైడ్ అయ్యాయి. డిసెంబర్ 21న జిల్లా స్థాయిలో మహాధర్నా నిర్వహిస్తామని జేఏసీ నేతలు వెల్లడించారు. డిసెంబర్ 27 సాయంత్రం 4 గంటలకు విశాఖపట్నంలో, 30న తిరుపతిలో, జనవరి 3న ఏలూరులో, 6న ఒంగోలు నగరాల్లో సభలు నిర్వహించే కార్యాచరణను ఏపీ జేఏసీ, జేఏసీ అమరావతి నేతలు ప్రకటించారు.

ఉద్యోగులను ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అవమానకరంగా మాట్లాడుతున్నారని, ఏ సమస్య గురించి అడిగినా రేపు మాపు అంటూ వాయిదాల మీద వాయిదాలు వేస్తున్న సర్కార్ తీరుపై ఉద్యోగ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఎవరి శక్తి ఏంటో చూపిస్తామంటూ సవాల్ చేస్తున్నాయి.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఉద్యోగులతో తాము మాట్లాడామని, వారి భరోసాతోనే ఉద్యమించేందుకు ముందుకు పోతున్నామని ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి ఇచ్చిన గడువు ముగిసిపోవడంతో ఉద్యోగులు, పలు శాఖల ఉద్యోగ నాయకులతో సమావేశాలు నిర్వహించినట్లు బొప్పరాజు వెల్లడించారు. అనుభవిస్తున్న అవమానాలు చాలని, వెంటనే ఉద్యమానికి సిద్ధం కావాలని వారంతా డిమాండ్ చేసినట్లు ఏపీ జేఏసీ, జేఏసీ అమరావతి నేతలు పేర్కొన్నారు.