పార్లమెంట్ లో తెరాస లొల్లి.. వరి కొనుగోళ్లపై రచ్చ

ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వంతో కయ్యానికి కాలు దువ్వుతున్న తెరాస ఎంపీలు  పార్లమెంట్ శీతాకాల సమావేశాలు తొలి రోజే, తడాఖా చూపించారు వాయిదా తీర్మానంతో లోక్ సభలో రభస సృష్టించారు. హైదరాబాద్ లో మహా ధర్నా చేసినా, ఢిల్లీ యాత్రలు సాగించినా, ఫలితం లేక పోవడంతో, తెరాస పార్లమెంట్ సభ్యులు ఈ రోజు సభలో అదే విషయంపై చర్చకు వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు.

అయితే లోక్ సభలో స్పీకర్ తెరాస సభ్యుల వాయిదా తీర్మానం నోటీసుకు తిరస్కరించడంతో, ర‌భ‌స మొద‌లైంది. ప్ర‌శ్నోత్త‌రాల‌ను ర‌ద్దు చేసి రైతు స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించాల‌ని తెరాస ఎంపీలు డిమాండ్ చేశారు. తెలంగాణ మార్కెట్ యార్డుల్లో మ‌క్కిపోతున్న ధాన్యాన్ని కొనుగోలు చేయాల‌ని తెరాస ఎంపీలు డిమాండ్ చేశారు.లోక్ సభలో తెరాస పక్ష నేత నామ నాగేశ్వ‌ర‌రావు నేతృత్వంలో తెరాస స‌భ్యులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో స్పీక‌ర్ బిర్లా స‌భ‌ను కొద్దిసేపు వాయిదా వేశారు.

ధాన్యం సేకరణపై స్పష్టత కోసం పార్లమెంట్ ఉభయసభల్లో కేంద్రాన్ని నిలదీయాలని ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షడు కేసీఆర్ నిన్న జరిగిన పార్లమెంటరీ పార్టీ సమవేశంలో  ఇచ్చిన పిలుపు మేరకు.తెరాస సభ్యులు తొలిరోజే లోక్సభలో ఆందోళన చేపట్టారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి రైతు సమస్యలపై చర్చించాలని నినాదాలు చేశారు. ఆహార ధాన్యసేకరణలో జాతీయ సమగ్ర విధానాన్ని ప్రకటించాలని కేంద్రాన్ని కోరారు.  అయోమయ, అస్పష్టత విధానానాలతో తెలంగాణ రైతులతో పాటు దేశ వ్యవసాయ రంగానికి ఇబ్బందికరంగా మారిందని ఆక్షేపించారు. ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించారు. ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్రం త‌మ విధానాన్ని ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేశారు. దీంతో స్పీకర్ సభను మధ్యహ్నం వరకు వాయిదా వేశారు. 

అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ధన్యం కొనుగోలుకు సంబంధించి స్పష్టత ఇచ్చినా, తెరాస ఎంపీలు అనవసర వివాదాన్ని సృష్టిస్తున్నారని, బీజీపీ ఎంపీలు సభ వెలుపల ఎదురు దాడి చేశారు. వానాకాలం పంటకొనకుండా, రైతులను గోస పెడుతోంది రాష్ట్ర ప్రభుత్వం కాదా, అని బీజేపీ ఎంపీలు ప్రశ్నిస్తున్నారు.ఇందుకు సంబందించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుదిరిన లిఖిత్ పూర్వక ఒప్పందం ప్రకారం కేంద్ర ప్రభుత్వం బియ్యం సేకరిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పటికే హైదరాబాద్ లో ప్రకటించిన విషయం తెలిసిందే. అయినా తెరాస ఎంపీలు పార్లమెంట్’ను అడ్డుకోవడం ఏమిటని బీజేపీ ఎంపీలు అంటున్నారు.

Related Segment News