'మెగా' షాక్!.. దిగ్గజానికే దిక్కులేదా? జగనన్నా మజాకా!
posted on Dec 22, 2021 1:00PM
అతనో 'మెగా' బిజినెస్‌మేన్. తెలుగు రాష్ట్రాల్లో టాప్‌మోస్ట్ కాంట్రాక్టర్. కశ్మీర్ నుంచి అస్సోం వరకూ.. అనేక ప్రాజెక్టులు చేస్తుంటారు. కాళేశ్వరమైనా.. పోలవరమైనా.. ఆయన కట్టాల్సిందే. మోదీ ప్రభుత్వ ప్రాజెక్టులూ ఆయనకు దక్కాల్సిందే. లెక్కలేనంత సంపాదన. ఎక్కడికెళ్లినా పర్సనల్ లగ్జరీ చాపర్‌లోనే. మోదీ, కేసీఆర్, జగన్‌లకు మెగా పవర్ ఆయన. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రినైనా ఒక్కరోజులోనే కలిసొస్తారు. సీఎంలతో చిట్‌చాట్‌లోనే మెగా డీల్స్ చేసుకుంటారు. ఇక, తెలుగు సీఎంల కోసం వేల కోట్లు పెట్టుబడి పెట్టి.. నెంబర్ వన్ న్యూస్ ఛానెల్‌ను చేజిక్కించుకున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులకు అత్యంత ముఖ్యుడు. కానీ..... ఇటీవల కాలంలో సీఎం జగన్‌రెడ్డితో.. మెగా రెడ్డి గారికి ఎక్కడో తేడా కొట్టినట్టుంది. ఆ బిజినెస్ టైకూన్‌కు తాడేపల్లి ప్యాలెస్‌లో బిగ్ ఝలక్ తగిలింది. జగనన్న పర్మిషన్ కోసం 36 గంటల పాటు.. అనామకుడిగా.. కుక్కిన పేనులా.. పడిగాపులు కాశారట. సీఎం జగన్‌తో ఆ మెగా పర్సనాలిటీకి బాగా తేడాలొచ్చాయట. ఇంతకీ వాళ్ల మధ్య అసలేం జరిగింది? మెగా వ్యాపారవేత్తని జగన్‌రెడ్డి అంతగా ఎందుకు అవమానించారు?
నిమిషాల్లో పీఎం మోదీ అపాయింట్‌మెంట్ సాధించగల ఆయనకు.. సీఎం జగన్ క్యాబిన్‌లోకి మాత్రం అంత ఈజీగా ఎంట్రీ దక్కలేదు. ఏకంగా 36 గంటల పాటు జగన్ వెయిట్ చేయించారని తెలుస్తోంది. ఈయన ఆయన మనిషే అయినా.. ఈయన ఆయనకు మొదటినుంచి అత్యంత ఆప్తుడిగా ఉన్నా.. ఆయన గెలుపు కోసం ఈయన అన్నిరకాలుగా బాగా సహకరించినా.. గెలిచాక జగనన్న ఈయన చేతిలో పలు పెద్ద ప్రాజెక్టులు పెట్టినా.. ఇప్పుడు మాత్రం వారిద్దరి మధ్య సంబంధాలు బాగా చెడిపోయాయట. ఏపీ సీఎం జగన్‌రెడ్డిని కలవడానికి రోజున్నర పాటు పడిగాపులు పడాల్సి వచ్చిందట. రోజున్నర తర్వాత కూడా ముఖ్యమంత్రి అతన్ని కలిసింది లేనిది క్లారిటీ లేదు. ఈ విషయం ఈయనకు మెగా షాకింగే.
చేసిన పనులకు డబ్బులు అడగడానికి మెగా బిజినెస్‌మేన్.. సీఎం జగన్ దగ్గరికి వెళ్లారని తెలుస్తోంది. పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడుతున్నాం.. జేబు నుంచి డబ్బులు పెట్టుకుంటున్నాం.. చాలాకాలంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు మాత్రం రావట్లేదని.. పెండింగ్ బిల్లుల వసూళ్ల కోసం ఈయన.. జగన్ దగ్గరికి వెళ్లారట. మెగాకు 3వేల 800 కోట్ల వరకూ ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉందట. భారీ మొత్తం కావడంతో.. ఏకంగా యజమానే ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చారు. ఈయన ఎందుకు వచ్చారో తెలిసే.. బకాయిల చెల్లింపుపై ఏం చెప్పాలో తెలీకే.. జగన్ గంటల తరబడి అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా ముఖం చాటేశారనేది ఓ టాక్. ఏపీ ఖజానాలో చిల్లి గవ్వ కూడా లేదు. ఉద్యోగులకే వేళకు జీతాలివ్వలేని దుస్థితి. ఇక దాదాపు 4వేల కోట్ల బిల్లులు ఇంకేమిస్తారు. అందుకే, ఇలా తప్పించుకున్నారని అంటున్నారు. అయితే, జగన్ ముఖం చాటేయడంలో.. మరో ఆసక్తికర రాజకీయ అంశమూ ఉందనేది మరో వాదన.
మెగా మెన్ కు సంబంధించి మరో విషయం కూడా వెలుగులోకి వస్తోంది. కొన్ని రోజుల క్రితం ఏపీలోని బడా కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలతో ఈయన హైదరాబాద్ లో రహస్య సమావేశం పెట్టారని తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వ తీరు, భారీగా పోగుపడిన పెండింగ్ బిల్లులపై చర్చించారట. ఏపీలో చేసిన పనులకు బిల్లులు రాకపోవడంపై అంతా అసహనం వ్యక్తం చేశారట. జగన్ రెడ్డి పాలనపై బడా పారిశ్రామిక వేత్తలు తీవ్రమైన కామెంట్లు చేశారని సమాచారం. గత చంద్రబాబు పాలనపైనా సమావేశంలో చర్చ జరిగిందట. టీడీపీ హయాంలోనూ ప్రాజెక్టులు చేసింది వీళ్లే. అప్పుడు టైమ్‌కి బిల్లులు చెల్లించేవారని.. మన రెడ్డినే కదాని గెలిపించుకుంటే.. మన జేబులే ఖాళీ అవుతున్నాయని.. ఆ మీటింగ్‌లో ఉన్న బిగ్ బిజినెస్‌మేన్‌లు అంతా తీవ్ర అసహనం వ్యక్తం చేశారట. ఆ సమావేశం విషయాలు జగనన్న తెలిశాయని.. మెగా ఆధ్వార్యంలో జరిగిన ఆ మీటింగ్‌పై జగన్ గుర్రుగా ఉన్నారని.. తన మనిషే తనకు వ్యతిరేకంగా సమావేశంపెట్టి.. పెండింగ్ బిల్లులపై కాంట్రాక్టర్లను రెచ్చగొట్టడం ఏంటని.. ముఖ్యమంత్రి మెగాపై మండిపడుతున్నారని తెలుస్తోంది. ఆ మీటింగ్ జరిగిన కొన్నిరోజులకే సీఎంను కలిసేందుకు మెగా మేన్ రావడం.. ఆయనకు అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా రోజున్నర పాటు వెయిట్ చేయించడంపై.. రాజకీయ, వ్యాపార వర్గాల్లో బిగ్ న్యూస్.. బిగ్ డిబేట్ నడుస్తోంది.