ఈరోజు విశాఖకు రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం విశాఖపట్నం రాబోతున్నారు. ఆయన అధికారం చేప్పట్టగానే రాష్ట్రాభివృద్ధి కోసం ప్రకటించిన ఏడు మిషన్లలో ఒకటయిన మౌలికవసతుల కల్పన మిషన్ ఆరంభించేందుకు ఆయన నేడు విశాఖకు వస్తున్నారు. రాష్ట్రంలో ఓడరేవుల నిర్మాణం, వాటి అభివృద్ధి, పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై దేశ విదేశాల నుండి వచ్చిన 500 మంది ఔత్సాహిక పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలతో చర్చించి వారి సలహాలను సూచనలను స్వీకరించి, వారికి ఆయన తన ప్రభుత్వ విధానాలను వివరిస్తారు. ఆ తరువాత ఆయన సమక్షంలోనే రాష్ట్ర మౌలిక వసతులకల్పన మంత్రిత్వ శాఖ వివిధ సంస్థలతో రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధికి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేస్తుంది.

 

ఇందులో ప్రధానంగా జి.యం.ఆర్. మరియు కోనసీమ పవర్ సంస్థలు రెండూ కలిసి శ్రీకాకుళం-కాకినాడ మధ్య గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర గ్యాస్ డెవెలప్ మెంట్ సంస్థతో ఒక ఒప్పందం చేసుకోబోతున్నాయి. ఇదివరకు రాష్ట్ర ప్రభుత్వం 13జిల్లాలలో వివిద రకాల పారిశ్రామిక హబ్ లను కేటాయిస్తూ ఒక విధానం ప్రకటించింది. అందుకు అనుగుణంగా నేడు వివిధ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకొనే అవకాశం ఉంది. అదేవిధంగా వివిధ జిల్లాలలో ఇప్పటికే నెలకొల్పబడిఉన్న లేదా ఇక ముందు నెలకొల్పబోయే పరిశ్రమలకు అవసరమయిన మౌలిక వసతుల కల్పన కోసం వివిధ సంస్థలు ఈరోజు ఒప్పందాలు చేసుకొనే అవకాశం ఉంది.

 

రాష్ట్రంలో 13 జిల్లాలలో ప్రభుత్వం గుర్తించిన ప్రాంతాలలో రోడ్లు మరియు ఫ్లై ఓవర్ల నిర్మాణానికి కూడా ఈరోజు వివిధ సంస్థలు ఒప్పందాలు చేసుకొనే అవకాశం ఉంది. వీటిలో చాలా వరకు ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్యంలో ఏర్పాటు చేయబడే అవకాశం ఉంది. కనుక త్వరలోనే ఆయా పనులు కూడా ఆరంభం అవుతాయని ఆశించవచ్చును.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu