ఏపీ వ్యవసాయ బడ్జెట్ నేడే
posted on Mar 13, 2015 7:04AM
.jpg)
తెదేపా అధికారంలోకి వస్తే ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధి కోసం ప్రత్యేకంగా బడ్జెట్ ఏర్పాటు చేస్తూ అందుకు అవసరమయిన నిధులు కేటాయిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చేరు. ఆ ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెడుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఈరోజు రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్ శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నారు.అదే సమయంలో కార్మికశాఖ మంత్రి అచ్చెం నాయుడు వ్యవసాయ బడ్జెట్ ప్రతిని శాసనమండలిలో ప్రవేశపెడతారు.
జాతీయ ప్రాజెక్టుగా గుర్తించబడిన పోలవరం ప్రాజెక్టుకి ఒకవేళ కేంద్రం నిధులు అందించకపోయినట్లయితే రాష్ట్ర ప్రభుత్వమే దానిని పూర్తిచేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదివరకు ప్రకటించారు. కనుక దానిని పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఎటువంటి విధానం అనుసరించబోతోందనే సంగతి ఈ బడ్జెట్ లో కొంచెం స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేయవచ్చును. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన పట్టిసీమ ప్రాజెక్టుకు ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించే అవకాశం ఉంది. వంశధార, నాగావళి, తోటపల్లి ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాదే పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చేరు గనుక వాటికీ ఈ బడ్జెట్ లో అవసరమయిన నిధులు కేటాయించే అవకాశం ఉంది.