అంతా లోకేషే చేశాడు...అందుకే గుడ్ బై చెబుతున్నా....టీడీపీ ఎమ్మెల్సీ సంచలనం !

 

ఏపీ టీడీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ రాజీనామా చేశారు. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన సతీష్ టీడీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటూ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా సమర్పించారు. శాసనమండలిలో తన రాజీనామా పత్రాన్ని కూడా అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సతీష్.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి నారాయణను కూడా టార్గెట్ చేశారు.

లోకేష్, నారాయణలకి ఏ అర్హత ఉందని వారిని నేరుగా తీసుకొచ్చి పదవుల్లో కూర్చోబెట్టారని మండిపడ్డారు. ఏ అర్హత ఉందని రాజకీయాలతో సంబంధం లేని నారాయణకు మంత్రి పదవి ఇచ్చారని ప్రశ్నించారు. కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవని వ్యక్తికి పదవి ఎలా ఇచ్చారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. లోకేష్ తీరు నచ్చకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సతీష్ పేర్కొన్నారు. పార్టీ మీద కానీ, పార్టీ నిర్మాణం మీద కానీ లోకేష్‌కు కనీసం అవగాహన లేదని, తన తండ్రి తర్వాత పార్టీని ఎవరైనా లాక్కుంటారేమోనని లోకేశ్ అభద్రత భావానికి లోనై అందరినీ అనుమానిస్తున్నారని ఆరోపించారు. 

అందుకే అన్ని నియోజకవర్గాల్లో లోకేష్ గ్రూపులు తయారు చేశాడని అయన అన్నారు. లోకేష్ వల్లే గత ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైందని తెలిసీ తెలియని తనంతో లోకేష్ పార్టీని నాశనం చేశారన్నారు. కనీసం ఎమ్మెల్యేగా గెలవని లోకేష్‌కు, రాజకీయపరిజ్ఞానం లేని వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చి దీనికి తోడు మంత్రి పదవి కూడా కట్టబెట్టారని మండిపడ్డారు. లోకేష్ తానేదో పార్టీని ముందుండి నడిపిస్తున్నట్టుగా ఫీలయ్యేవారని ఏం అనుభవం ఉందని ఆయనకి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారో చెప్పాలని అన్నారు. 

తాను, తన కుమారుడే పార్టీని నడుపుతున్నామన్న భావనలో చంద్రబాబు ఉన్నారని  175స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు అంతా వెధవలు అని అర్ధం వచ్చేలా చెప్పిన చంద్రబాబు,అలాంటి వెధవల్నిచూడొద్దని తనని చూసి ఓటేయాలని ఎన్నికల్లో ప్రచారం చేశారని చెప్పారు. ఈ వ్యాఖ్యలు తనను కలిచివేశాయని పరిస్థితి ఇలాగే కొనసాగితే టీడీపీలో చివరికి చంద్రబాబు, లోకేష్‌లు తప్ప ఎవరూ మిగలరన్నారు. 

ఒకప్పుడు పార్టీలో ఎంతో స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఉండేవని, ఇవాళ పార్టీలో ఆ పరిస్థితి లేదని అన్నారు. పార్టీలో ఉన్నవారిని చంద్రబాబు అసమర్ధులుగా గుర్తించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు సతీష్. అందుకే తాము అసమర్ధులం కాబట్టే వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను చేర్చుకుని అందులో నలుగురికి మంత్రిపదవులు ఇచ్చారని అన్నారు. అయితే తనకు మొదటి నుంచి సుజనాచౌదరి అన్ని విధాలా అండదండగా ఉన్నారని చెప్పడం చూస్తోంటే ఆయన బీజేపీ తీర్ధం పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.