కాంగ్రెస్ కి మరో షాక్...గోవాలో పది మంది ఎమ్మెల్యేలు జంప్ !

 

కాంగ్రెస్‌ పార్టీకి వరుస షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. మొన్న తెలంగాణాలో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీనే లేకుండా టీఆర్ఎస్ లో కలిసిపోగా, నిన్న కర్ణాటకలో ఎమ్మెల్యేలు అలకపాన్పు ఎక్కి కూర్చున్నారు. ఈ సంకోభం నుండే  గట్టేక్కేందుకు తంటాలు పడుతుండగానే ఇప్పుడు గోవాలోనూ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు చీలిక వర్గంగా ఏర్పడి అధికార బీజేపీలో  లెజిస్లేటివ్ పార్టీని విలీనం చేయాలని కోరుతూ స్పీకర్‌కు లేఖ సమర్పించారు. 

ప్రతిపక్ష నేత చంద్రకాంత్‌ కవలేఖర్‌ నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందం బుధవారం సాయంత్రం స్పీకర్‌ను కలిసింది. తమ వర్గానికి చెందిన 10మంది ఎమ్మెల్యేలను బీజేపీ శాసనసభాపక్షంలో విలీనం చేయాలని స్పీకర్‌కు లేఖ సమర్పించారు. ఈ అనూహ్య పరిణామంతో కాంగ్రెస్‌ పార్టీకి అసెంబ్లీలో కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. బీజేపీ బలం 27కు చేరిందని సీఎం స్పీకర్ కి లేఖ రాశారు. అయితే ఈ 10మందిని బీజేపీ శాసనసభాపక్షంలో కలుపుతూ స్పీకర్ రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని అంటున్నారు.  

నిజానికి 2017లో గోవాలో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌కు దెబ్బ వేసి బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆనాటి నుండే ప్లాన్ చేస్తూ వచ్చి ఈరోజు ఏకంగా పదిమందిని తమ పార్టీలో చేర్చుకునే ప్లాన్ చేసింది. స్పీకర్‌కు లేఖ ఇచ్చిన ఆ ఎమ్మెల్యేలు అందరూ ఢిల్లీ పయనమైనట్లు, బీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో వీరంతా బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. 

అలాగే బీజేపీకి మిత్రపక్షంగా, ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న గోవా ఫార్వర్డ్‌ పార్టీకి చెందిన డిప్యూటీ సీఎం విజయ్‌ సర్దేశాయ్‌ సహా ఇతర మంత్రులను తొలగించి కొత్తగా కాంగ్రెస్ నుంచి వచ్చి వారికి మంత్రి పదవులు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌.  ప్రస్తుత అసెంబ్లీలో బిజెపి -17, కాంగ్రెస్‌ 15, గోవా పార్వర్డ్‌ పార్టీ 3, మహారాష్ట్రవాదీ గోమాంతక్‌ పార్టీ 1, ఎన్‌సిపి, స్వతంత్రులు ఇద్దరు చొప్పున ఉన్నారు. తాజా పరిణామాలతో కాంగ్రెస్‌ సభ్యుల సంఖ్య ఐదుకు పడిపోగా బీజేపీ బలం ఇరవై ఏడుకు చెరనుంది.