కామెడీ సినిమాలతో చావుని జయించాడు

 

నార్మన్ కజిన్స్- ఈ పేరు చాలామంది విని ఉండకపోవచ్చు! కానీ వ్యక్తిత్వ వికాస పుస్తకాలతో పరిచయం ఉన్నవారు ఎక్కడో అక్కడ, ఏదో ఒక సందర్భంలో ఆయన గురించి వినే ఉంటారు. మనిషిలో సానుకూల దృక్పథం ఉంటే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలుసుకోవాలంటే... నార్మన్ జీవితమే ఓ ఉదాహరణ!

 

నార్మన్ ఓ జర్నలిస్ట్. అమెరికాలోని ఓ ప్రముఖ పత్రికలో చేరి, క్రమక్రమంగా దాని మేనేజింగ్ ఎడిటర్ స్థాయికి ఎదిగిన సమర్థుడు. ప్రపంచశాంతి కోసం పాటుపడినవాడు. జపాను మీద అమెరికా అణుదాడి చేసినప్పుడు, నిర్భయంగా తన నిరసనను వ్యక్తపరిచిన వ్యక్తి. నార్మన్ వ్యక్తిగత జీవితమూ, వృత్తి జీవితమూ చాలా అద్భుతంగా సాగిపోతున్న కాలంలో ఓ పిడుగులాంటి వార్త వినిపించింది.

 

1964లో నార్మన్కి 49 ఏళ్ల వయసు ఉండగా... అతనికి Ankylosing spondylitis అనే అరుదైన వ్యాధి ఉందని తేల్చారు. అప్పట్లో ఈ వ్యాధి వచ్చినవారు బతికేందుకు అవకాశం చాలా తక్కువగా ఉండేదట. ఈ వ్యాధి సోకి ప్రతి 500 మందిలో ఒక్కరు మాత్రమే బతికే అదృష్టం ఉంటుందట. మరికొద్ది రోజులలో నువ్వు చనిపోబోతున్నావు కాబట్టి ‘చివరగా’ పూర్తిచేసుకోవాల్సిన పనులు ఏమన్నా ఉంటే పూర్తిచేసుకోమంటూ.... వైద్యులు నార్మన్కు సూచించారు.

 

ఒకపక్క తాను అతి త్వరలో చనిపోబోతున్నానన్న విషాధం. మరోపక్క ఆ వ్యాధి కలిగిస్తున్న అంతులేని బాధ. దాంతో నార్మన్కు ఏం చేయాలో పాలుపోలేదు. కానీ ఒకరోజు అకస్మాత్తుగా ఆయనకి ఓ ఆలోచన వచ్చింది. రోగం, బాధ కలిసి ఉన్నప్పుడు- ఆరోగ్యం, సంతోషం కూడా కలిసి ఉండాలి కదా! తను బాధగా ఉంటే రోగం నయం కాకపోవచ్చు. కానీ సంతోషంగా ఉంటే ఏదన్నా అద్భుతం జరగవచ్చు కదా! ఆ ఆలోచన రాగానే నార్మన్ ఓ నిర్ణయానికి వచ్చాడు.

 

నార్మన్ వెంటనే హాస్పిటల్లోంచి బయటకు వచ్చేశాడు. ఓ హోటల్లో గది అద్దెకు తీసుకున్నాడు. తను పోగుచేసుకున్న సంపాదనతో ఓ ప్రొజెక్టరు కొన్నాడు. ఇక అంతే! ఆ ప్రొజెక్టరులో కామెడీ సినిమాలు వేసుకోవడం, అదే పనిగా నవ్వడం- ఇదే దినచర్యగా పెట్టుకొన్నాడు. వాటికి తోడు రోగనిరోధశక్తిని పెరిగేందుకు పుష్కలంగా C విటమిన్ పుచ్చుకున్నాడు.

 

ఫలితం! ఎవ్వరూ నమ్మలేని విధంగా నార్మన్ మామూలు మనిషి అయిపోయాడు. కొద్ది రోజుల్లో చనిపోతావని చెప్పిన వైద్యుల మాటలని తారుమారు చేస్తూ మరో 26 ఏళ్లు బతికాడు. ఆ తర్వాత కాలంలో సంతోషంగా ఉండటం వల్లా, నవ్వు వల్లా ఆరోగ్యానికి ఎన్ని లాభాలు ఉంటాయో చెబుతూ బోలెడు పరిశోధనలు వెలుగులోకి వచ్చాయి. నవ్వుతో immunoglobulin A, T lymphocytes వంటి రోగనిరోధకశక్తిని పెంపొందించే కణాలు వృద్ధి చెందుతాయని తేలింది. నవ్వుతో శరీరంలో ఉండే వైరస్, క్యాన్సర్ కణాలను ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుందని బయటపడింది.

 

నార్మన్ తన అనుభవంతో Anatomy of an Illness అనే పుస్తకాన్ని రాశాడు. సానుకూల దృక్పథంతో, చిరునవ్వుతో తాను చావుని ఎలా జయించాడో అందులో చెప్పుకొచ్చాడు. వ్యక్తిత్వ వికాస రంగంలో ఆ పుస్తకం ఇప్పటికీ ఓ సంచలనమే!

- నిర్జర.