రియల్ ఎస్టేట్ రాబందులకు చెక్!

 

ఎక్కడ అభివృద్ధి జరుగుతూ వుంటే అక్కడ రియల్ ఎస్టేట్ రాబందులు వాలిపోతూ వుంటాయి. ప్రస్తుతం అభివృద్ధికి అపారమైన అవకాశాలున్న ఆంధ్రప్రదేశ్ మీద రియల్ ఎస్టేట్ రాబందుల దృష్టి పడింది. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఏర్పాటు అంశాన్ని ఈ రాబందులు క్యాష్ చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. రాజధాని ఏర్పడే ప్రాంతంలో భూముల ధరలు విపరీతంగా పెంచేసి సదరు భూములు అటు ప్రభుత్వానికి, ఇటు సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా చేసే ప్రయత్నాలు ఎప్పుడో ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు పరిసరాల్లో భూముల ధరలు ఆకాశాన్ని అంటడానికి ప్రధాన కారణం రియల్ ఎస్టేట్ వ్యాపారులే. విజయవాడ, గుంటూరు పరిసరాల్లో మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలలో రాజధాని వస్తుందంటూ వదంతులను వ్యాపింపజేసి చాపకింద నీరులాగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ దగ్గర వున్న భూములను చల్లగా అమ్ముకుని కోట్లు గడిస్తున్నారు. నిజంగా సదరు ప్రాంతంలో రాజధాని వచ్చేస్తుందేమోనన్న ఆశతో చాలామంది సామాన్యులు తక్కువ ధర వుండే భూములను ఎన్నో రెట్లు ఎక్కువ ధరకు కొనుగోలు చేసి మోసపోతున్నారు. రియల్ఎస్టేట్ వ్యాపారులు ఎలాగైతే హైదరాబాద్‌లో సామాన్యుడికి సొంత ఇల్లు లేకుండా చేశారో అదే వ్యూహాన్ని కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అనుసరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారుల పుణ్యమా అని భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ ధోరణికి కళ్ళెం వేయడానికి, రియల్ ఎస్టేట్ రాబందులకు చెక్ పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. విజయవాడ పరిసరాల్లో భూముల రిజిస్ట్రేషన్లపై నిషేధం విధించింది. అయితే ఈ నిషేధం చట్టపరంగా కుదరదన్న అభిప్రాయాలు వినిపిస్తూ వుండటంతో ఈ మార్గం కాకపోతే మరో మార్గంలో అయినా భూముల ధరలకు కళ్ళెం వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu