అటువంటి ఉన్మాదుల నుండి రాష్ట్రాన్ని రక్షించుకోవాలి: బాబు
posted on Oct 17, 2015 11:37AM
(2).jpg)
ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి ప్రభుత్వం పిలిచినా తను రానని జగన్మోహన్ రెడ్డి చెప్పడం పై అధికార, ప్రతిపక్షాల మధ్య ప్రస్తుతం మాటల యుద్ధం జరుగుతోంది. ప్రజలు కూడా దాని గురించి చర్చించుకొంటున్నారు. మీడియాలో కూడా ఆయన నిర్ణయంపై రసవత్తరమయిన చర్చలు జరుగుతున్నాయి. ఎప్పుడూ చాలా సంయమనంగా ఆచితూచి మాట్లాడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డిని చాలా తీవ్రంగా విమర్శించారు.
ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ “ దేశంలో ఇతర రాష్ట్రాలు మాకు ముంబై ఉంది...మాకు చెన్నై ఉంది...మాకు డిల్లీ ఉంది... మాకు హైదరాబాద్ ఉంది...అని గొప్పగా చెప్పుకొంటుంటే మనం ఏమి చెప్పుకోవాలి? మాకు 13 జిల్లాలు ఉన్నాయని చెప్పుకోవాలా? మనమూ గర్వంగా చెప్పుకొనే అటువంటి రాజధాని నగరం మనకి అవసరం లేదా? అనేక సమస్యలని, సవాళ్ళని ఎదుర్కొంటూ మనమందరం గర్వపడే విధంగా ఒక గొప్ప రాజధాని నగరం నిర్మించాలని నేను ప్రయత్నం చేస్తుంటే, ఆయన (జగన్) నేనేదో డబ్బు వెనకేసుకోవడానికే కడుతున్నానని అర్ధం పర్ధం లేని విమర్శలు చేస్తూ రాజధాని నిర్మాణానికి అడుగడుగునా అడ్డుపడుతున్నాడు. ఇంత నెగెటివ్ థింకింగ్, అసూయ, ఓర్వలేనితనం ఉన్న వ్యక్తిని నేను నా జీవితంలో ఎన్నడూ చూడలేదు. అమెరికాలో తుపాకులు పట్టుకొని అన్నెం పున్నెం తెలియని విద్యార్ధులపై కాల్పులు జరిపే ఉన్మాదుల వంటి వ్యక్తుల నుండి మనం మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు నేను కృషి చేస్తుంటే, రాష్ట్రాభివృద్ధికి అడుగడునా జగన్ అడ్డం పడుతూనే ఉన్నాడు. ఆయనకి మేము చేసే పనులను వ్యతిరేకించడం తప్ప మరేమీ పని లేదు. అటువంటి వ్యక్తులకు గల్లీ నుండి డిల్లీ వరకు అందరూ లోకువగానే కనిపిస్తుంటారు. అందుకే నోటికి వచ్చినట్లు లేనిపోని ఆరోపణలు చేస్తూనే ఉంటారు,” అని ఆగ్రహం వ్యక్తం చేసారు.