అధిక వడ్డీ వసూలు చేస్తే...
posted on Dec 21, 2015 9:11PM

దేశ వ్యాప్తంగా వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీలు వసూలు చేస్తూ పేదలను నిలువునా దోచుకుంటున్నారు. ఈ వడ్డీ వ్యాపారం శ్రుతి మించి, అదుపుతప్పి ప్రాణ, మానాలతో కూడా ఆడుకునే స్థాయికి పెరిగి పోయింది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బయటపడిన కాల్‌మనీ వ్యవహారం. కాల్‌మనీ, మైక్రో ఫైనాన్స్... ఇలా పేరు ఏదైనా సదరు వ్యాపారుల లక్ష్యం మాత్రం అధిక వడ్డీలు వసూలు చేయడం. వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్నవారు ఎందరో! ఏపీలో కాల్ మనీ వ్యవహారం రచ్చ రచ్చ అయిన తర్వాత ఏపీ ప్రభుత్వం అధిక వడ్డీ నియంత్రణకు చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ముందుగా కాల్ మనీ వ్యాపారుల భరతం పట్టడంలో నిమగ్నమైంది. రాష్ట్రవ్యాప్తంగా వున్న వడ్డీ వ్యాపారుల మీద దాడులు జరిపి అక్రమంగా, అనైతికంగా వడ్డీ వ్యాపారం చేస్తున్న వారి మీద కేసులు పెట్టింది. దానితో పాటు మరో ప్రశంసనీయమైన ముందడుగు వేసింది.
ఇకమీదట ఏపీలో అడ్డగోలుగా వడ్డీ వ్యాపారం చేసేవారి నడ్డి విరగడం ఖాయం. వడ్డీ వ్యాపారులను సమర్థంగా నియంత్రించాలంటే సమగ్రమైన చట్టాన్ని తేవాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించిన చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించింది. వడ్డీ వ్యాపార నియంత్రణ బిల్లును సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీ వసూలు చేస్తే మూడేళ్ళ జైలు శిక్షతోపాటు లక్ష రూపాయల జరిమానా విధిస్తారు. అంచేత... అధిక వడ్డీలు వసూలు చేసే వడ్డీ వ్యాపారులూ... పారాహుషార్!