విదేశీ విద్యపై మోజుకి బలవుతున్న భారతీయ విద్యార్ధులు

 

అమెరికాలో ఉన్నత విద్యలభ్యసించాలనే భారతీయ విద్యార్ధుల తాపత్రయం అక్కడి కొన్ని విశ్వవిద్యాలయాలకు వరంగా మారుతుంటే, ఆ విద్యార్ధుల జీవితాలకు శాపంగా మారుతోంది. విదేశీ విద్యార్ధులను చేర్చుకొనేందుకు అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీ వర్సిటీ, నార్త్‌ వెస్ట్రన్‌ పాలిటెక్నిక్‌ కాలేజిలు కొన్ని అవకతవకలకు పాల్పడుతున్నట్లు అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ గుర్తించడంతో ఆ రెండు విశ్వవిద్యాలయాలను పరిశీలనలో ఉంచింది. కానీ ఆ రెండు విశ్వవిద్యాలయాలు తాము నిషేధిత జాబితాలో లేవని విద్యార్ధులకు, వారి తల్లి తండ్రులకు భరోసా ఇస్తూ నేటికీ విదేశీ విద్యార్ధులను చేర్చుకొంటునే ఉన్నాయి. అందులో చేరేందుకు భారత్ తో సహా వివిధ దేశాలలో గల అమెరికా కౌన్సిలేట్ లు వీసాలు జారీ చేస్తున్నాయి కూడా. కానీ వాటిలో చేరేందుకు శాన్‌ఫ్రాన్సికో వెళ్ళిన 14మంది భారతీయ విద్యార్ధులను ఎఫ్.బి.ఐ. అధికారులు నిర్బందించి సుమారు ఒకరోజు ప్రశ్నించిన తరువాత వారందరినీ అమెరికాలో ప్రవేశించేందుకు అనుమతి నిరాకరించారు. అందరూ తక్షణమే వెనక్కి తిప్పి పంపించేసారు.

 

ఉన్నత విద్యలభ్యసించేందుకు ఎంతో వ్యయప్రయాసలతో అమెరికా చేరుకొన్న విద్యార్ధుల జీవితాలు ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారాయి. వారి ఈ పరిస్థితి చూసిన తరువాత కూడా ఇంకా కొంతమంది హైదరాబాద్ కి చెందిన విద్యార్ధులు అదే విశ్వవిద్యాలయాలలో చేరేందుకు సిద్దమవడం విశేషం. వారందరూ అమెరికా వెళ్ళేందుకు ఎయిర్ ఇండియాలో టికెట్లు కూడా కొనుకొన్నారు. కానీ అమెరికాకు వెళ్ళిన విద్యార్ధులనే వెనక్కి తిప్పి పంపేస్తుంటే, మళ్ళీ మరో బ్యాచ్ విద్యార్ధులను అదే విశ్వవిద్యాలయంలో చేరడానికి తీసుకువెళ్ళడానికి ఎయిర్ ఇండియా నిరాకరించింది. టికెట్ కోసం విద్యార్ధులు చెల్లించిన మొత్తాన్ని కూడా వెనక్కి తిరిగి ఇచ్చేసేందుకు సిద్దపడింది.

 

ఆ సంస్థ చెపుతున్న విషయాలలో నిజానిజాలు తెలుసుకోకుండా దానిలో టికెట్స్ బుక్ చేసుకొన్న విద్యార్ధులు నిన్న హైదరాబాద్ లోని ఎయిర్ ఇండియా కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. సదరు విశ్వవిద్యాలయాలు భరోసా ఇస్తునప్పుడు, అమెరికా ప్రభుత్వమే వాటిలోజేరేందుకు వీసాలు జారీ చేస్తునప్పుడు మధ్యలో ఎయిర్ ఇండియాకి అభ్యంతరం ఏమిటి? అని వారు ప్రశ్నిస్తున్నారు. కానీ ఎయిర్ ఇండియా సంస్థ వారిని తీసుకువెళ్ళడానికి అంగీకరించడం లేదు. నిజానికి ఎయిర్ ఇండియా ఒక విమానయాన వ్యాపార సంస్థ మాత్రమే. కనుక దానికి విద్యార్ధుల జీవితాల గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. వాళ్ళని అక్కడికి తీసుకువెళ్ళి తిరిగి వెనక్కి తీసుకు రావడం వలన దానికి ఎంతో కొంత లాభమే తప్ప నష్టం ఉండబోదు. కానీ భారతీయ విద్యార్ధులు నష్టపోకూడదనే ఒక సామాజిక బాధ్యతతోనే వారిని హెచ్చరిస్తోందని స్పష్టం అవుతోంది. కనుక దానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్ధులు అందరూ ముందు అమెరికా నుంచితిప్పి పంపబడిన విద్యార్ధులను కలిసి, వారు ఆవిధంగా ఎందుకు రావలసివచ్చిందో తెలుసుకొంటే మంచిది.

 

కానీ ఆ రెండు విశ్వవిద్యాలయాలలో విదేశీ విద్యార్ధులు చేర్చుకోవడానికి అమెరికా కౌన్సిలేట్ వీసాలు ఎందుకు జారీ చేస్తున్నాయి? విద్యార్ధులను తమ దేశంలో అడుగుపెట్టేందుకు అమెరికా ప్రభుత్వం స్వయంగా వీసాలు జారీ చేసినపుడు మళ్ళీ వారిని ఎందుకు తిప్పి పంపిస్తోంది? ఆ రెండు విశ్వవిద్యాలయాలు పరిశీలనలో ఉంచినపుడు విదేశీ విద్యార్ధులను చేర్చుకోవడానికి ఎందుకు అనుమతోస్తోంది? లేదా అమెరికా నుండి వెనక్కి తిప్పి పంపబడిన విద్యార్ధులు ఆ విశ్వవిద్యాలయాలలో చేరేందుకు తప్పుడు పత్రాలు ఏమయినా సమర్పించడం వలననే ఈవిధంగా జరిగిందా? అనే ప్రశ్నలకు సమాధానాలు కనుగొనవలసి ఉంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu