ఆయుధపోటీలో దూసుకుపోతున్నాం

 

అమెరికా అంటే అందరికీ గుర్తుకువచ్చేది ఆధునికత. రష్యా పతనం తరువాత తిరుగులేకుండా పోయిన అమెరికా, ప్రపంచీకరణను పూర్తిగా అందిపుచ్చుకుంది. అభివృద్ధిలో వెనుకబడేది లేదంటూ అగ్రరాజ్యాలలో ముందు నిలిచింది. కానీ చాలామంది అంతగా గమనించని విషయం, అమెరికా చేసే ఆయుధ వ్యాపారం. ఆయుధాల మీద సంపాదన సాగించే దేశాలలో అమెరికా, ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. టైం పత్రిక అంచనా ప్రకారం 2014లో అమెరికా ఆయుధాల విక్రయం ద్వారా రెండు లక్షల కోట్లకు పైగా సంపాదించింది. గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే క్రమంగా భారత్‌ కూడా, అమెరికా ఆయుధ వ్యాపారంలో ఓ పావుగా మారిపోతోందన్న భయాలు కలుగుతున్నాయి.

 

ఏ ప్రాంతంలో అయితే అనిశ్చిత పరిస్థితులు ఏర్పడతాయో ఆ ప్రాంతంలో అమెరికా ఆయుధ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది. అమెరికా నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే దేశాలను గమనిస్తే ఈ విషయం స్పష్టంగా తేలిపోతుంది. దక్షిణ కొరియా, ఇరాక్‌ వంటి దేశాలు ఈ జాబితాలో ముందుంటాయి. పక్కపక్కనే ఉండే రెండు దేశాల మధ్య ఏదో ఒక వివాదం ఉండటం సహజమే! అందుకని ఎప్పటికప్పుడు యుద్ధానికి కాచుకునేలా ఆయుధాలను పోగేసుకోవడమూ సబబే! కానీ ఒకోసారి తన వ్యాపారం కోసం, సదరు ఆయుధపోటీని అమెరికానే ప్రోత్సహించడం ఓ వైచిత్రి. తీవ్రవాదం మీద పోరు నెపంతో పాకిస్తాన్‌కు, అమెరికా ఎఫ్‌-16 విమానాలను అందించడమే ఇందుకు ఓ స్పష్టమైన ఉదాహరణ.
ఒకప్పుడు భారత్‌ తనకు అవసరమనుకునే ఆయుధాలను రష్యా నుంచి కొనుగోలు చేసేది. కానీ ఆధునికతలో రష్యా వెనకబడుతూ ఉండటం, కాలం చెల్లిన ఆయుధాలనే అమ్మకానికి పెట్టడంతో... ఆయుధ సంపత్తి కోసం ఇతర దేశాల వైపు దృష్టి సారించడం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఎక్కువగా లాభపడింది అమెరికా అని వేరే చెప్పనవసరం లేదు కదా! 2007 నుంచి 80 వేల కోట్లకు పైగా విలువ చేసే ఆయుధాలను అమెరికా నుంచి భారత్‌ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ లెక్కలు ముందుముందు మరింతగా పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో F/A-18 విమానాలనీ, సైనిక పర్యవేక్షణను అవసరమయ్యే డ్రోన్లనీ కూడా భారీ సొమ్ముని వెచ్చించి అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేయనుందన్న వార్తలు వస్తున్నాయి.

 

మన దేశంతో ఇలాంటి ఆయుధ ఒప్పందాలన్నింటినీ సమీక్షించేందుకు, సాక్షాత్తూ అమెరికా రక్షణ శాఖ మంత్రి ఆస్టన్‌ కార్టర్‌ దిల్లీకి చేరుకున్నారు. వీటికి తోడుగా అమెరికా, భారత్‌లు రెండూ ఒకరి భూభాగాల మీద మరొకరు యుద్ధవిమానాలు, నౌకలను నిలుపుకొనేలా కూడా ఓ ఒప్పందం కుదరనుంది. కేవలం మరమ్మతులు, ఇంధనం నింపుకోవడం, సహాయక చర్యలు.... తదితర అవసరాల కోసమే ఈ ఒప్పందం అని బయటకు చెబుతున్నప్పటికీ... ఆమెరికా వాహనాలను భారత భూభాగంలోకి అనుమతించడం వెనుక వేరే ఆంతర్యం ఉంది. రోజురోజుకీ భారత భూభాగం చుట్టూ ఉన్న సముద్ర జలాల మీద చైనా వ్యూహాత్మకంగా పట్టుని సాధిస్తోంది. పాకిస్తాన్ సాయంతో అక్కడి బెలూచిస్తాన్‌లో ఏకంగా ఒక నౌకాశ్రయాన్ని నిర్మించుకుంటోంది. గ్వదర్‌ అనే ప్రాంతంలో సాగుతున్న ఈ నిర్మాణం పూర్తయితే, భారతదేశంలోకి పశ్చిమ సముద్రజలాల మీద చైనా పట్టు సాధించే అవకాశం ఉంది. ఇటు దక్షిణచైనా సముద్రాన్ని కూడా ఆ దేశం నిదానంగా ఆక్రమించుకుంటోంది. సహజ వనరులు మెండుగా ఉన్న ఈ ప్రాంతంలో చైనా సాగిస్తున్న ఆక్రమణ వెనుక ఆర్థిక కారణాలను మించిన ఆంతర్యాలు ఉన్నాయి. ఈ ఆక్రమణతో చైనా చుట్టపక్కల ఉన్న జపాన్‌, మలేసియా, వియత్నాం, ఫిలిప్పీన్స్‌ తదితర దేశాలన్నింటి మీదా పై చేయి సాధిస్తుంది. తద్వారా భారతదేశ తూర్పు తీరం మీద కూడా ఆధిపత్యం సాగిస్తుంది. ఇలా మన దేశం మూడు పక్కలా ఉన్న జలాల మీద చైనా పట్టు సాధించే ప్రయత్నం ఎలాగూ చేస్తోంది. మరోవైపు పాక్‌ ఆక్రమిత కశ్మీరంలో చక్కగా రహదారులను, వంతెనలను నిర్మించుకుంటూ భారత్‌ను రెచ్చగొడుతోంది.

 

చైనా దూకుడు సహజంగానే భారత్‌కు ఆందోళన కలిగిస్తోంది. మన శత్రు దేశమైన పాకిస్తాన్‌కు వ్యూహాత్మకంగా చైనా సాయపడుతూ వస్తోందని అందరికీ తెలిసిందే! కానీ నేరుగా మనతో శత్రుత్వం సాగించే తత్వాన్ని ఇప్పుడిప్పుడే చైనా అలవర్చుకుంటోంది. ఈ పరిస్థితిలో అమెరికాను మన భూభాగంలో అనుమతించక తప్పలేదు భారత్‌కు. ఎప్పటికప్పుడు ఆధునిక యుద్ధ సామాగ్రిని పోగేసుకోకా తప్పడం లేదు. ఫ్రాన్స్‌ నుంచి 65 వేల కోట్ల విలువైన రాఫెల్ విమానాలను కొనుగోలు చేసినా, అమెరికా నుంచి మరిన్ని విమానాలను కొనుగోలు చేసేందుకు తొందరపడుతున్నా... ఇటు పాకిస్తాన్‌, అటు చైనాల నుంచి పొంచి ఉన్న ప్రమాదాలను నిలువరించేందుకే! నిజానికి చైనా, పాకిస్తాన్‌లతో మనకు యుద్ధం జరుగుతుందని కాదు. మన ఆయుధ సంపత్తిని చూసైనా అవి తమ దూకుడుని తగ్గించుకుంటాయన్నది భారత్‌ ఆశ. ఇప్పుడు ప్రపంచంలో యుద్ధాలన్నీ ఇలా పరోక్షంగానే సాగుతున్నాయి. ఒక దేశానికి మించి మరో దేశం ఆయుధాలను పెంచుకుంటూ పోతోంది. కానీ ఈ ఆయుధపోటీలో బాగుపడుతున్న దేశాల గురించి ప్రత్యేకించి మళ్లీ చెప్పుకోనవసరం లేదు.

 

రక్షణ అవసరాల కోసం, శత్రువులని నిలువరించడం కోసం ఆయుధాలను సమకూర్చుకోవడం తప్పేమీ కాదు. యుద్ధమంటూ జరిగితే కాలం చెల్లిన ఆయుధాలే మన పరాజయాలను శాసిస్తాయి. కానీ అదే సమయంలో దౌత్యపరమైన సంబంధాలను మెరుగుపరుచుకోవడం కూడా చాలా అవసరం. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇంకా ఆకలి, పేదరికం, అనారోగ్యం, నిరక్షరాస్యత వంటి శాపాలు అక్కడి ప్రజల నుదుటి రాతగా మారుతుంటే... కేవలం రక్షణ కోసం కొన్ని లక్షల కోట్లు ఖర్చుచేయాల్సి రావడం ఎంత దురదృష్టకరం. కాబట్టి అమెరికా, ఫ్రాన్స్‌, రష్యా వంటి దేశాలు నిజంగా తమను తాము ప్రపంచానికి పెద్దన్నలుగా భావిస్తుంటే, చేయాల్సింది ఆయుధవ్యాపారం కాదు... దౌత్యం! విస్తరించాల్సింది ఆయుధ సామ్రాజ్యం కాదు... స్నేహహస్తం! స్నేహాన్ని మించిన లాభసాటి ఒప్పందం మరేముంటుంది?