లాతూర్‌ నీటి రైలు... నేర్పుతున్న పాఠాలు

 

లాతూర్‌...ఈ పేరు వినగానే రెండు దశాబ్దాల క్రితం వచ్చిన భూకంపమే మనసులో మెదుల్తుంది. ఆ విపత్తులో దాదాపు పదివేల మంది చనిపోయి ఉంటారని అంచనా. కానీ ఇప్పుడు లాతూర్‌ అంతకంటే తీవ్రమైన విపత్తు ఉంది. కానీ ఈ విపత్తులో కోల్పోయే ప్రాణాలని లెక్కపెట్టడం సాధ్యమయ్యే పని కాదు. ఇది కేవలం ప్రకృతి సృష్టించిందీ కాదు! లాతూర్‌ ఇప్పుడు తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. అక్కడికి రైల్వే వ్యాగన్లలో నీటిని తరలించాల్సిన దుస్థితి దాపురించింది.

 

లాతూర్‌కి ‘షుగర్‌ బెల్ట్ ఆఫ్‌ ఇండియా’ అని పేరు. ఆ జిల్లాలో విస్తృతంగా చెరకుని పండించడమే దీనిక కారణం. సహకార సంఘాల ద్వారా నిర్వహించే అనేక చెరకు ఫ్యాక్టరీలకు లాతూర్‌ ప్రసిద్ధి. అదే సమయంలో లాతూర్‌ను తరచూ కరవు కాటకాలు పీడించే చరిత్ర కూడా ఉంది. లాతూర్‌ చెరకు రైతులు పంటను గుర్తుంచుకున్నారే కానీ, కరువు సంగతి మర్చిపోయారు. లాతూర్‌ అధికారులు ఫ్యాక్టరీలను చూసి మురిసిపోయారే కానీ, భూగర్భజలాల సంగతి పట్టించుకోలేదు. ఫలితం... అటు వర్షాలు సరిగా కురవకున్నా, నీటికి అనుగుణమైన పంటలను పండించేందుకు ఎవరూ సిద్ధపడలేదు. నీరు సమృద్ధిగా అవసరమయ్యే చెరకు పంటనే నమ్ముకున్నారు. అందుకోసం ఎడాపెడా బోర్లు వేయడం మొదలుపెట్టారు. ఏడాది తరువాత ఏడాది రుతుపవనాలు ముఖం చాటేస్తున్న కొద్దీ, బోర్లు మరింత లోతుకి వెళ్లసాగాయి. రాష్ట్రం కరువులోకి జారిపోతోందని స్పష్టంగా తెలుస్తున్నా, అధికారులు కూడా చూసీ చూడనట్లు ఊరుకున్నారు. బోర్ల తవ్వకం మీద నిషేధం విధించడం కానీ, జలాశయాలలో తగినంత నీటిమట్టాన్ని ఉండేలా చర్యలు తీసుకోవడం కానీ చేయలేదు. వీలైనంత ఎక్కువగా వర్షపు నీటిని ఒడిసిపట్టే ప్రయత్నాలు చేయలేదు. దాంతో లాతూర్ ప్రాంతం, ఆ మాటకి వస్తే మహారాష్ట్రలోని అధిక శాతం వందేళ్లలో కనీవినీ ఎరుగని కరువుకోరల్లో చిక్కుకుపోయింది.

 

లాతూర్‌లో ప్రస్తుతం తాగేందుకు గుక్కెడు మంచినీరు కూడా దొరకని పరిస్థితి. నీరు లేకపోవడంతో పాఠశాలలు మూతపడ్డాయి. ఆఖరికి ఆపరేషన్లను కూడా వాయిదా వేసే పరిస్థితి వచ్చింది. ఇక ఇంటికి నేరుగా మంచినీరు సరఫరా కావడం అనేది ఒక కలగా మారిపోయింది. మొన్నటివరకూ పదిహేను రోజులకు ఓసారి జరిగే ఈ సరఫరా ప్రస్తుతం నిలిచిపోయింది. లాతూర్‌కి మంచినీటిని సరఫరా చేసే ధనేగావ్‌ జలాశయం ఎండిపోవడంతో ప్రజల దాహాన్ని తీర్చేందుకు అధికారులు తలలు పట్టుకోవలసి వచ్చింది. లాతూర్‌లో ఇంకా ఎక్కడెక్కడ మంచినీరు లభ్యమవుతోందో వివరాలు సేకరించడం మొదలుపెట్టారు అధికారులు. కాస్తో కూస్తో నీరు కనిపిస్తున్న బావులు, చెరువుల వద్ద 144 సెక్షన్లను అమలు చేసి, తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ట్యాంకర్ల ద్వార మంచినీటిని సరఫరా చేయడం మొదలుపెట్టారు. అయినా కూడా ప్రజల దాహార్తిని తీర్చేందుకు అవి చాలలేదు సరికదా, ట్యాంకర్ల నుంచి వచ్చే కొద్దిపాటి మంచినీరు కోసం కొట్లాటలు మొదలయ్యాయి. ఇక పబ్లిక్‌ ట్యాపు ద్వారా నీటిని సరఫరా చేసేందుకు అధికారులు సాగించిన ప్రయత్నం కూడా బెడిసికొట్టింది. దాదాపు పదిగంటల పాటు కుళాయి ముందర నిల్చొంటే కానీ బిందెడు నీళ్లు పట్టుకోలేని పరిస్థితి!

 

లాతూర్‌లోని కొన్ని ప్రాంతాల్లో గత నాలుగు నెలలుగా మంచినీటి సరఫరా లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ కరువుకాలంలో కూడా డబ్బున్నవాడికి ఎలాంటి బాధా లేదు. 150 రూపాయలు ఖర్చుపెడితే పదిలీటర్ల నీరు శుభ్రంగా దొరుకుతుంది. కానీ అంత ఖర్చుచేయలేని వారు, లాతూర్‌ జిల్లానే వదిలిపెట్టి వలసపోతున్నారు. పట్టుదలతో అక్కడే ఉన్నా, తాగేందుకు తగినంత నీరు లేకపోవడం వల్ల కిడ్నీ రాళ్లతో బాధపడేవారి సంఖ్య పెరిగిపోతోంది. పరిస్థితి తీవ్రతను గమనించిన మహారాష్ట్ర ప్రభుత్వం లాతూర్‌కు రైల్వేల ద్వారా మంచినీటిని తీసుకువచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టింది. లాతూర్‌కు 300 కిలోమీటర్ల దూరంలోని ఉజనీయ జలాశయం నుంచి తొలివిడతగా 5 లక్షల లీటర్ల నీటిని ఇవాళ లాతూరుకి చేరవేశారు. ఈ నీటిని శుద్ధి చేసి లాతూర్ నగరానికీ, పరిసర గ్రామాలకీ అందిస్తారు. ఈ రైలు వస్తున్న మార్గంలోని గ్రామాల ప్రజలు దాడి చేసి నీటిని ‘దోచుకోకుండా’ ఉండేందుకు కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య రైలు ప్రయాణం సాగింది.

 

ప్రస్తుతానికైతే లాతూర్‌ దాహార్తి తీరే మార్గం దొరికింది. కానీ మున్ముందు పరిస్థితి ఏమిటన్నదే ప్రశ్న! ఉజనీ జలాశయం చుట్టుపక్కల ఉండే ప్రజల, ఈ నీటి మళ్లింపుని వ్యతిరేకించడం మొదలుపెడితే? అసలు ఉజనీ కూడా ఎండిపోతే? లాతూర్ సంగతి సరే! మరి మిగతా ప్రాంతాల దాహం తీరేదెలా? ఈ ఏడాది వర్షపాతం కూడా సరిగా లేకపోతే?... ఆలోచించే ఓపికుండాలే కానీ ఇలాంటి ప్రశ్నలు ఒకదాని వెంబడి ఒకటి మెదుల్తూనే ఉంటాయి. కాబట్టి లాతూర్‌ విషయంలో ప్రకృతి కరుణిస్తుందనీ, రుతుపవనాలు వర్షిస్తాయనీ ఆశిద్దాము. అదే సమయంలో లాతూర్‌ అంశం మిగతా దేశానికి ఒక గుణపాఠంగా నిలవాలని కోరుకుందాము. పరిస్థితులను బట్టి ఏ పంటలు వేయాలి! భూగర్భ జలాలను ఎలా పరిరక్షించుకోవాలి! వర్షపు నీటిని ఎలా ఒడిసిపట్టుకోవాలి!... తదితర అంశాల మీద అటు ప్రభుత్వాలు, ఇటు ప్రజలు విచక్షణతో వ్యవహరిస్తారని కోరుకుందాం. లేకపోతే లాతూరులో కనిపించే నీటి రైళ్లని విజయవాడలోనో, సికింద్రాబాదులోనో చూడాల్సి వస్తుంది. అదేమంత శుభశకునం కాదు కదా!