అంబేద్కర్‌నాటి సమస్యలు అలాగే ఉన్నాయి

 

అంబేద్కర్‌ పుట్టి నేటికి 125 సంవత్సరాలు. రాజ్యంగ నిర్మాతగా, తొలి న్యాయమంత్రిగా, దళిత నేతగా అంబేద్కర్‌ నేటికీ మార్గదర్శకునిగానే ఉన్నారు.

 

అంబేద్కరు పుట్టిన పరిస్థితులు సాధారణమైనవి కావు. ఒక పక్క ఆంగ్లేయుల పాలన, మరోపక్క అస్పృశ్యత.... ఈ రెండూ ఉన్నచోట పేదరికం ఎలాగూ ఉండనే ఉంటుంది. ఇన్ని సమస్యల మధ్య కూడా అంబేద్కరు మేధస్సుని నమ్ముకున్నాడు. మహర్‌ కులంలో జన్మించినా చదువులో మాత్రం దూసుకుపోయాడు. మహర్లు మహారాష్ట్రలోని అత్యంత వెనుకబడిన కులాలలో ఒకరు. ఆ రాష్ట్రంలో అధికంగా కనిపించే ఈ కులం మీదే మహారాష్ట్ర అన్న పేరు వచ్చిందన్న వాదన కూడా ఉంది. వీరికి ఆలయ ప్రవేశాలు కానీ, బావులలో తోడుకునే అవకాశాలు కానీ ఉండేవి కాదు. ఒకవేళ ఎలాగొలా బడికి వెళ్లినా, అక్కడ తాము తెచ్చుకున్న ఓ గోనెపట్టా మీద బిక్కుబిక్కుమంటూ కూర్చుని దూరం నుంచే పాఠాలను వినాల్సి వచ్చేది. ఇక సాటి విద్యార్థులు, ఉపాధ్యాయులు అనే సూటిపోటి మాటలు, చూసే చూపులు సరేసరి. అయినా అంబేద్కర్ పట్టుదల ముందు అవేమీ నిలవలేదు. తరగతి తరువాత తరగతి ముందుకు సాగుతూనే ఉన్నాడు.

 

హైస్కూలు, మెట్రిక్యులేషన్‌, డిగ్రీ... ఇలా అంబేద్కర్‌ చదువు సాగుతూనే వచ్చింది. భారతదేశంలో డిగ్రీని సాధించిన మొదటి దళితుడు అంబేద్కరే అని కొందరంటారు. అంబేద్కర్‌ అక్కడితో ఆగలేదు. ఇంగ్లండులోని కొలంబియా విశ్వవిద్యాలయం, లండన్ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో అనేక ఉన్నత డిగ్రీలను సాధించారు. M.A., Ph.D... ఇలా అంబేద్కర్‌ ఏం చదివినా అందులో భారతదేశానికి సంబంధించిన సమస్యల గురించే సిద్ధాంత పత్రాలను రూపొందించేవారు. భారతీయ కులవ్యవస్థ, ఇక్కడి ఆర్థిక స్థితిగతులు, రూపాయి ఆవిర్భావం.. ఇలాంటి అంశాల మీదే పరిశోధన సాగించేవారు.

 

ఉన్నత చదువులన్నీ చదువుకుని అంబేద్కరు భారతదేశానికి తిరిగివచ్చినా కూడా ఆయనను ఆస్పృశ్యత వీడిపోలేదు. కాలేజీలు, కార్యాలయాలు... ఇలా ఎక్కడ ఉద్యోగం చేసినా ఆయన వివక్షనే ఎదుర్కొనేవారు. ఆయన కిందిస్థాయి ఉద్యోగులు కూడా అంబేద్కరును ముట్టుకునేందుకు సాహసించేవారు కాదు. దాంతో కులవివక్షను అంతమొందించేందుకు కేవలం విద్యే కాదు ఉద్యమం కూడా అవసరమే అన్న అభిప్రాయానికి వచ్చారు. అందుకే దళితులందరినీ ఏకం చేసి ఉద్యమాలను నడిపించడం మొదలుపెట్టారు.

 

ఒకపక్క దళిత ఉద్యమాలను నడిపిస్తూనే, మరోవైపు రాజకీయాలలో చురుకుగా పాల్గొన్నారు అంబేద్కరు. అంబేద్కరు అవసరాన్ని గుర్తించిన కాంగ్రెస్‌ ఆయనను స్వాతంత్ర భారతంలో తొలి న్యాయశాఖామంత్రిగా నియమించింది. భారత రాజ్యాంగాన్ని నిర్మించే బాధ్యతనూ అప్పగించింది. అంబేద్కర్‌ సారధ్యంలో రూపొందిన రాజ్యాంగానికి ప్రపంచంలోనే పరిపూర్ణమైన రాజ్యాంగమని పేరు. రాజ్యాంగబద్ధంగా బడుగులకీ, వెనుకబడిన కులాలకీ అంబేద్కర్ ఎన్ని సౌకర్యాలు కల్పించారో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అదే స్థాయిలో అందులో ఎలాంటి వివాదాస్పద నిబంధనా చోటుచేసుకుండా ఉండేందుకు శతథా ప్రయత్నించారు. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించి ఇప్పటికీ ఆ సమస్యను రాజుకునేలా చేసిన ఆర్టికల్‌ 370 అంటే అంబేద్కరుకు ఏమాత్రం ఇష్టం లేదు. కానీ ఆనాటి ప్రభుత్వ పెద్దల బలవంతం మీదే ఆయన దానికి ఒప్పుకోవలసి వచ్చింది.

 

కేవలం రాజ్యాంగమే కాదు రిజర్వ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా, ఫైనాన్స్‌ కమీషన్ వంటి ఆర్థిక పునాదులన్నీ ఆంబేద్కర్ ఆలోచనల మీదే ఏర్పడ్డాయి. అంబేద్కరు తన జీవిత చరమాంకంలో కులప్రసక్తి లేని బౌద్ధమతాన్ని స్వీకరించారు. అంబేద్కరు జీవితాన్ని తరచి చూస్తే ఆయనలో ఎన్నో పార్శ్వాలు కనిపిస్తాయి. సామాజిక సంస్కర్తగా, విద్యావేత్తగా, రాజ్యాంగ నిర్మాతగా, మేధావిగా, రచయితగా, రాజకీయవేత్తగా, ఆర్థికవేత్తగా.... ఇలా ఎన్నో కోణాలు కనిపిస్తాయి. ఆయా రంగాలలో అంబేద్కరు ప్రతిభావంతునిగా చెలరేగడం ఒక ఎత్తైతే, ఆ ప్రతిభనంతా దేశ పురోగతి కోసమే వినియోగించడం మరో ఎత్తు. అందుకే స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా అంబేద్కరు చూపించిన మార్గంలోనే సామాజిక సంస్కరణలు సాగుతున్నాయి.

 

అయినా అంబేద్కరు ఎదుర్కొన్న సమస్యలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఇప్పటికీ దేశం కులాల ప్రాతిపదికన చీలిపోయి ఉంది. ఒకరకంగా ఈ విభజన కూడా అస్పృశ్యతే! కేవలం రిజర్వేషన్ల ఆధారంగానో, అంబేద్కరు జయంతుల నిర్వహణ వల్లనో, ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటిచడంతోనో ఇది తీరిపోయేది కాదు. అంబేద్కరు రాసిన రాజ్యాంగాన్నే కాదు, ఆయన రాసిన పుస్తకాలను కూడా వెలికి తీయాలి. అందులో ఆయన ప్రస్తావించిన విషయాల మీద చర్చలు జరగాలి. కుల వ్యవస్థ, వెనుకబాటుతనం, అసమానతలు వంటి విషయాల మీద పోరాడే ధైర్యం కావాలి. లేకపోతే సమస్యలు అలాగే ఉండిపోతాయి. అటు రాజకీయ నాయకులు, ఇటు కులపెద్దలు కేవలం పరిష్కరాలనే చూపుతూ పబ్బం గడుపుకుంటూ ఉండిపోతారు.