టీడీపీ కార్యాలయంలో అక్కినేని కుటుంబం!
posted on Feb 7, 2025 3:14PM

ప్రముఖ తెలుగు హీరో అక్కినేని నాగార్జున కుటుంబంతో సహా తెలుగుదేశం కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. ఆగండి హైదరాబాద్ లోనో అమరావతిలోనో కాదు.. ఢిల్లీలో. పార్లమెంటులోని తెలుగుదేశం కార్యాలయానికి నాగార్జున కుటుంబంతో సహా వచ్చారు. ఢిల్లీలో లెజండరీ అక్కినేని నాగేశ్వరరావు పై ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమం ఢిల్లీలో జరగనుంది.
అక్కినేని నాగేశ్వరరావు వారసులుగా ఆ కార్యక్రమం ప్రమోషన్ కోసం అక్కినేని కుటుంబం ఢిల్లీకి వచ్చింది. అందులో బాగంగానే పార్లమెంటును సందర్శించింది. పార్లమెంటు సందర్శనలో భాగంగా పార్లమెంటు ఆవరణలోని తెలుగుదేశం కార్యాలయానికీ వచ్చింది. వారికి తెలుగుదేశం ఎంపీలు సాదర స్వాగతం పలికారు.
అక్కినేని నాగార్జున, అక్కినేని అమల, అక్కినేని నాగ చైతన్య, ఆయన భార్య శోభితలు తెలుగుదేశం కార్యాలయంలో సందడి చేయడం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ లో జగన్ అధికారంలో ఉన్న కాలంలో అక్కినేని నాగార్జున ఆయనకు సన్నిహితంగా ఉండేవారన్న సంగతి తెలిసిందే. అటువంటి నాగార్జున కుటుంబంతో సహా తెలుగుదేశం కార్యాలయానికి రావడం చర్చనీయాంశంగా మారింది. వారు తెలుగుదేశం కార్యాలయానికి వచ్చిన సందర్భంగా వారితో కలిసి దిగిన ఫొటోను తెలుగుదేశం ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ ఫొటో వెంటనే వైరల్ అయ్యింది.